Reliance Walt Disney Merger :దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటుకు నిర్ణయించాయి. సంయుక్త సంస్థలో రిలయన్స్ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్ గురించి ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాలకు తెర దించుతూ ఇరు సంస్థలు బుధవారం ప్రకటన విడుదల చేశాయి.
ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం కానుంది. జాయింట్ వెంచర్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది. విలీన సంస్థలో రిలయన్స్‌కు 16.34 శాతం, వయాకామ్ 18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు దాఖలు పడనున్నాయి. ఈ మీడియా వెంచర్‌కు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్‌గా ఉంటారు.
'సరికొత్త శకానికి నాంది'
భారత వినోద పరిశ్రమలో సరికొత్త శకానికి ఈ ఒప్పందం ద్వారా నాంది పలికినట్లు అయ్యిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ మీడియా గ్రూప్‌గా ఉన్న డిస్నీతో వ్యూహాత్మక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. దీని వల్ల తమ వ్యాపారాభివృద్ధితో పాటు దేశంలోని ప్రేక్షకులకు అందుబాటు ధరకే కంటెంట్‌ను అందించడం వీలు పడుతుందని పేర్కొన్నారు. డిస్నీని రిలయన్స్ గ్రూప్‌లో కీలక భాగస్వామిగా సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రిలయన్స్‌తో ఒప్పందం ద్వారా దేశంలోనే అతిపెద్ద మీడియా కంపెనీగా అవతరించనున్నామని, ప్రేక్షకులకు నాణ్యమైన ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ కంటెంట్‌ను అందించడం వీలు పడుతుందని వాల్ట్ డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ తెలిపారు.