RBI Guidelines For Credit Card Limit : ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగిపోయింది. షాపింగ్స్, బిల్ పేమెంట్స్ వంటి వాటికి క్రెడిట్ కార్డులను నిత్యం ఎంతోమంది వినియోగిస్తున్నారు. వీటిని ఉపయోగించే విషయంలో యూజర్లకు చాలానే సందేహాలు ఉంటాయి. ఈఎంఐ నుంచి బిల్ సైకిల్ దాకా వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు అనుమానాలు వస్తుంటాయి. ఇలా తరచుగా ఎదురయ్యే సందేహాలకు ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సమాధానాలు ఇచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు జారీ
కస్టమర్ల అనుమతితోనే కొత్త క్రెడిట్ కార్డును బ్యాంకులు జారీ చేయాలి. ఒకవేళ అప్లై చేయకున్నా కార్డును పంపితే దానిని యాక్టివేట్ చేయకూడదు. కస్టమర్లు రిక్వెస్ట్ చేసిన ఏడు రోజుల్లోగా ఎలాంటి ఛార్జీలు లేకుండా క్రెడిట్ కార్డు అకౌంటును బ్యాంకులు మూసేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సమాచారాన్ని కస్టమర్‌కు చేరవేయాలి. అనంతరం కస్టమర్ ఆ క్రెడిట్ కార్డును ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో ఏదైనా సమస్య తలెత్తితే ఆర్‌బీఐ అంబుడ్స్‌మెన్‌కు కస్టమర్ ఫిర్యాదు చేయొచ్చు.
బిల్లింగ్ సైకిల్ తేదీని మార్చుకోవచ్చా?
క్రెడిట్ కార్డు బిల్ సైకిల్ ఏ తేదీన మొదలు కావాలి? ఏ తేదీన ముగియాలి? అనేది డిసైడ్ చేసుకోవడానికి, కనీసం ఒకసారైనా వాటిని మార్చుకోవడానికి కస్టమర్లకు బ్యాంకులు ఆప్షన్ ఇవ్వాలి. హెల్ప్‌లైన్, ఈ-మెయిల్ ఐడీ, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ వంటి వాటి ద్వారానూ బిల్లింగ్ సైకిల్ తేదీలలో మార్పులు చేయాలని యూజర్లు కోరవచ్చు.
క్రెడిట్ లిమిట్ ఎంత వరకూ?
ప్రతీ క్రెడిట్ కార్డుపై ఎంత మొత్తాన్ని వాడుకోవచ్చు అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒకవేళ అర్హులైన కస్టమర్లు రిక్వెస్ట్ చేస్తే క్రెడిట్ లిమిట్‌కు మించి డబ్బును వాడుకునే ఆప్షన్‌ను బ్యాంకులు ఇవ్వొచ్చు. అవసరం లేదనుకుంటే లిమిట్‌కు మించి ఖర్చు చేసేలా ఇచ్చిన ఆప్షన్‌ను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే కస్టమర్‌కు చెప్పకుండా ఎక్స్ట్రా క్రెడిట్ లిమిట్ ఇవ్వడం, దానిపై ఛార్జీలను బాదడం అనేది బ్యాంకులు చేయకూడదు. యూజర్లపై ఓవర్ లిమిట్ ఛార్జీలను వేసేటప్పుడు వడ్డీ, రుసుములను క్రెడిట్ లిమిట్ పరిధిలోకి తీసుకోవద్దని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.
లావాదేవీ చేయకపోయినా కార్డు యూజ్ చేసినట్లేనా?
ఆర్థిక లావాదేవీలు చేస్తేనే క్రెడిట్ కార్డును వాడినట్టుగా మీరు భావిస్తున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్లే. క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ తీయడం, పిన్ మార్చడం, లావాదేవీల పరిమితిని సవరించడం వంటి యాక్టివిటీస్ అన్నీ కార్డు వినియోగం కిందకే వస్తాయి. అయితే ఇతర కారణాలతో కస్టమర్ కేర్ సెంటర్‌కు కాల్ చేస్తే మాత్రం కార్డు ఉపయోగిస్తున్నట్లుగా లెక్కలోకి తీసుకోరు.
పాక్షిక చెల్లింపులపై వడ్డీ, రుసుములు వర్తిస్తాయా?
క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్‌కు ఒక లాస్ట్ డేట్ ఉంటుంది. దాన్ని తప్పకుండా ఫాలో కావాల్సిందే. ఆలోగా బిల్లు కట్టకపోతే వడ్డీ రహిత గడువు ప్రయోజనం కస్టమర్‌కు లభించదు. పాక్షిక చెల్లింపులు చేస్తే మిగిలిన మొత్తంపై మాత్రమే లావాదేవీ జరిగిన రోజు నుంచి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. బకాయి అమౌంటుపై ఇతరత్రా ఛార్జీలు కూడా పడతాయి.