Railway Ticket Advance Booking New Rules :ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా పండగ సమయాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసి రద్దీని తగ్గించడానికి కృషి చేస్తుంది. అయితే, తాజాగా ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు నవంబర్ 1వ తేదీ 2024 నుంచి అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధనలు తెలియకపోతే ప్రయాణాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి, ఆ కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం.. ప్రయాణానికి 120 రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉండగా.. దానిని 60 రోజులకుభారతీయ రైల్వే కుదించింది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. అయితే, అక్టోబర్ 31 నాటికి బుక్ చేసుకున్న వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని భారతీయ రైల్వే స్పష్టం చేసింది.
కొత్త నిబంధనల్లో ముఖ్యమైన విషయాలు..
- కొత్త రూల్స్ నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, అక్టోబర్ 31 వరకు బుకింగ్ చేసుకున్న వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి.
- తాజ్ ఎక్స్‌ప్రెస్ (Taj Express), గోమతి ఎక్స్‌ప్రెస్ (Gomti Express ) వంటి రైళ్ల బుకింగ్‌లో ఎటువంటి మార్పూ లేదని రైల్వే శాఖ తెలిపింది. ఎందుకంటే ఇప్పటికే వాటిలో బుకింగ్ వ్యవధి తక్కువగా ఉందని తెలిపింది.
- విదేశీ పర్యాటకులు 365 రోజుల ముందుగానే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే రైల్వే శాఖ ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు.
- గతంలో 1995-98 కాలంలో టికెట్ బుకింగ్ వ్యవధి 30 రోజులుగా ఉండేది. అయితే, అప్పట్లో కొన్ని మార్పులు చేసి రైల్వే ముందస్తు బుకింగ్ ప్రయాణానికి 60 రోజుల ముందు కొనసాగించారు. కానీ, దానిని 120 రోజులకు పెంచిన భారతీయ రైల్వే.. తాజాగా మళ్లీ మునుపటి వ్యవధికే మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది.