Portfolio Diversification Tips in Telugu: కొంతమందికి ఇష్టమైన పెట్టుబడి పథకాలు ఉంటాయి. అధిక రాబడి వస్తుందని వాటిల్లో మాత్రమే పెట్టుబడి పెడుతుంటారు. మరికొందరు స్మాల్ క్యాప్ షేర్లు, బంగారు, స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతారు. అయితే ఇలా మీ డబ్బు మొత్తాన్ని ఒకే పథకంలో ఉంచకూడదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ డబ్బులను విభిన్న పథకాలకు మళ్లించడమే సురక్షితమని సూచిస్తున్నారు.
ప్రతి ఒక్కరికీ ఒక ఆర్థిక లక్ష్యం అనేది ఉంటుంది. అదే సమయంలో మీ ఆర్థిక స్తోమత, నష్టాన్ని భరించే శక్తి, ఎంత కాలం కొనసాగిస్తారు అనే దానిపై ఆధారపడి పథకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ వల్ల నష్టభయం బాగా తగ్గుతుంది. పైగా దీర్ఘకాలంలో మంచి రాబడి సంపాదించడానికి వీలవుతుంది. కనుక మీరు ఈక్విటీ, డెట్ ఫండ్స్, బంగారం, రీట్స్ లాంటి వివిధ పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది.
నష్టం రాకుండా చూసుకోవచ్చు
వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఒక దానిలో నష్టం వచ్చినా మిగిలిన వాటి ద్వారా ఆ నష్ట ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈక్విటీల్లో బలమైన పురోగమనం కనిపిస్తుంది. అదే అస్థిరంగా ఉన్నప్పుడు బంగారం తదితర సురక్షిత పథకాలు మీ పెట్టుబడులను కాపాడతాయి.