తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇకపై ఒక బ్యాంక్ అకౌంట్​కు నలుగురు నామినీలు- బ్యాంకింగ్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కీలక బ్యాంకింగ్‌ బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్‌సభ - ఇకపై డిపాజిటర్లు, నలుగురు పేర్లను నామినీలుగా చేర్చుకునే అవకాశం.

Lok Sabha Passes Banking Laws Bill
Lok Sabha Passes Banking Laws Bill (source (Sansad TV))

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2024, 9:19 PM IST

Lok Sabha Passes Banking Laws Bill : బ్యాంకు వినియోగదారు తన అకౌంట్​కు నలుగురు నామినీలను అనుసంధానం చేసేందుకు వీలు కల్పించే కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో పాటే పలు కీలక ప్రతిపాదనలతో తీసుకొచ్చిన బ్యాంకింగ్‌ చట్టాలు (సవరణ) బిల్లు-2024 మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దీనిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సభ ముందు ప్రవేశపెట్టారు. కాగా, ప్రస్తుతం బ్యాంకు ఖాతాకు ఒక నామినీని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది.

ఆరు దశాబ్దాల కింద!
ఇంకా బ్యాంకుల్లో డైరెక్టర్‌షిప్‌ హోదా కోసం ఉండాల్సిన కనీస వాటా పరిమితిని కూడా పెంచేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మొత్తం ప్రస్తుతం రూ.5 లక్షలుగా ఉంది. ఇప్పుడు ఉన్న పరిమితి దాదాపు ఆరు దశాబ్దాల కింద నిర్దేశించింది. దాన్ని ఇప్పుడు రూ.2 కోట్లకు పెంచారు.

లాకర్ సదుపాయం ఉన్నవారు మాత్రం!
ఈ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు. ఇకపై డిపాజిటర్లు నలుగురు నామినీలను ఒకేసారి లేదా ఒకటి తర్వాత ఒకటి ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. లాకర్‌ సదుపాయం ఎంచుకున్న వారు మాత్రం ఒకరు తర్వాత ఒకరుగా నామినీలను ఎంచుకోవచ్చని నిర్మల పేర్కొన్నారు.

బ్యాంకులు సురక్షితంగా, స్థిరంగా, ఆరోగ్యకరంగా
2014 నుంచి ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు ఆర్‌బీఐ, బ్యాంకుల స్థిరత్వానికి కృషి చేస్తూ వస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ చెప్పుకొచ్చారు. బ్యాంకులు సురక్షితంగా, స్థిరంగా, ఆరోగ్యకరంగా ఉంచాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు నిర్మల.

పాలనా వ్యవహారాలను బలోపేతం
సహకార బ్యాంకుల్లో డైరెక్టర్ల పదవీ కాలం కూడా 8 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచేందుకు వీలుగా ఈ బిల్లు ప్రతిపాదిస్తోందని అన్నారు. అలాగే, ఆడిటర్లకు చెల్లించే రెమ్యునరేషన్‌పై కూడా బ్యాంకులకు ఈ బిల్లు స్వేచ్ఛ కల్పిస్తోందని చెప్పారు. ఈ బిల్లులోని సవరణలన్నీ బ్యాంకింగ్‌ రంగంలో పాలనా వ్యవహారాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. వినియోగదారుల సౌలభ్యం మెరుగవుతుందని నిర్మల సీతారామన్ చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details