U19 Asia Cup Vaibhav Suryavanshi : యూఏఈ వేదికగా జరుగుతోన్న అండర్ - 19 ఆసియా కప్ 2024లో యువ భారత్ అదిరే ప్రదర్శన చేసింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో యూఏఈపై విజయం సాధించి, వరుసగా రెండో గెలుపుతో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఈ విజయంలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కీలకంగా వ్యవహరించాడు. అతడి అద్భుత ప్రదర్శనతో భారత్ 10 వికెట్ల తేడాతో యూఏఈపై గెలిచింది.
అయితే ఈ టోర్నీలోని మొదటి రెండు మ్యాచుల్లో ఆశించిన మేర రాణించలేకపోయాడు సూర్య వంశీ. కానీ ఇప్పుడు మూడో మ్యాచ్‌లో మాత్రం తన బ్యాట్‌ను ఝుళిపించాడు. ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తనను రూ.1.1 కోట్లు పెట్టి ఎందుకు కొనుగోలు చేసిందో చెప్పడానికి, తాజాగా తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు.
ఈ పోరులో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ అంతగా ప్రదర్శన చేయలేకపోయింది. భారత బౌలర్ల దెబ్బకు యూఏఈ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 44 ఓవర్లలో 137 పరుగులకు యూఏఈ జట్టు ఆల్ ఔట్ అయింది. రయాన్ ఖాన్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో యుధాజిత్ గుహ మూడు వికెట్లు పడగొట్టాడు. చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ తలో రెండు, కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే తలో ఒక్క వికెట్ తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు మంచి ప్రదర్శన చేశారు. 13 ఏళ్ల సూర్యవంశీ అద్భుతంగా రాణించాడు. సిక్స్‌లు, ఫోర్లతో అదరగొట్టాడు. 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను టచ్ చేశాడు. మొత్తంగా 46 బంతుల్లో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 6 సిక్స్‌లు, 3 ఫోర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ఆయుశ్ కూడా అర్ధ శతకంతో రాణించాడు. దీంతో భారత్ 16.1 ఓవర్లలోనే వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.
కాగా, ఈ టోర్నీలో ఆడిన తొలి రెండు మ్యాచుల్లో వైభవ్ పేలవ ప్రదర్శన చేశాడు. పాకిస్థాన్‌పై 9 బంతుల్లో 1 పరుగు, జపాన్‌పై 23 బంతుల్లో 23 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం గ్రూప్-ఏ పాయింట్స్ టేబుల్లో పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్-2లో భారత్ శ్రీలంకతో తలపడే ఛాన్స్ ఉంది.
భారత్, పాక్ మ్యాచ్ జట్టులోకి 13 ఏళ్ల IPL బాయ్ - ఈ ఆసక్తి పోరు ఫ్రీగా ఎలా చూడాలంటే?