Year End Financial Planning : మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టనున్నాం. వచ్చే ఏడాది కోసం ఏం చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. అయితే నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందు పలు ఫైనాన్సియల్ విషయాలు గురించి తెలుసుకోవాలి. అలాగే వాటి సంబంధించిన గడువు తేదీని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్నింటికి డిసెంబర్ 31 వరకే డెడ్‌లైన్ ఉంటుంది. అంతేకాకుండా 2025 కోసం ఆర్థిక ప్రణాళికలు కూడా చేసుకుంటే అనవసరమైన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ డిసెంబర్లో దృష్టి సారించాల్సిన ఆర్థిక అంశాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పెట్టుబడులను రీబ్యాలెన్స్ చేయడం
ఈ ఏడాదిలో ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకుని ఉంటాం. కానీ మార్కెట్ల ఒడుదొడుకులు కారణంగా వాటిని సాధించలేకపోవచ్చు. అయితే రీబ్యాలెన్సింగ్ ద్వారా వాటిని సాధించవచ్చు. అందుకోసం మ్యూచవల్ ఫండ్స్, స్టాక్స్, ఇతర పెట్టుబడులను సమీక్షించాలి. మనం అనుకున్న స్థాయిలో రాణించామా లేదా అంతకంటే ఎక్కవగానే సాధించామా అనేది చూసుకోవాలి.
ఆదాయపు పన్ను ఆదా కోసం ప్రణాళికలు
వచ్చే ఏడాదికి సంబంధించి ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు ప్రణాళికలు చేయడానికి ఇదే సరైన సమయం. పన్ను విధానంలో చట్టం కల్పించిన కొన్ని మినహాయింపులను క్లెయిం చేసుకోవడం ద్వారా పన్ను ఆదా చేయొచ్చు. సెక్షన్ 80సీ ద్వారా కల్పించే మినహయింపు కోసం ఇంకా ఎంత పెట్టుబడి పెట్టడానికి వీలు అవుతుందో లేదో తెలుసుకోవాలి. సెక్షన్ 80డీ గురించి కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుతూ మన పన్ను ఆదా చేయడానికి గొప్ప మార్గంగా ఉంటుంది. సమయానికి కంటే ముందుగానే పన్ను చెల్లించేలా ప్లాన్ చేసుకోవాలి. ఇది వడ్డీ, పెనాల్టీలు, అనవసరమైన ఒత్తిడి వంటి వాటిని నివారించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కొత్త, పాత పన్ను విధానాల్లో ఏది ఎంపిక చేసుకోవాలో కూడా ముందుగానే నిర్ణయించుకోవాలి.
రుణాల చెల్లింపులు
ఈ మధ్య కాలంలో చాలా మంది క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారు. ఏడాది చివరిలో వాటిపై దృష్టి పెట్టడం చాలా అవసరం. రుణం ఎంత ఉంది, వడ్డీ ఎంత పడుతుంది అనేది చూడాలి. వాటిని క్లియర్ చేసేందుకు ప్రయత్నించడం మంచిది. వాటి కోసం మనకు వచ్చే బోనస్‌లు, అదనంగా వచ్చే ఆదాయాలు వంటివి ఉపయోగించడం ఉత్తమం. గృహ రుణాలు ఉంటే వాటిని ముందస్తుగానే చెల్లించేలా ప్లాన్ చేయాలి. ఎందుకంటే చాలా ముందస్తు చెల్లింపులకు అనుమతి ఇవ్వడమే కాకుండా వడ్డీ భారాన్ని కూడా తగ్గిస్తుంది.
బోనస్‌లతో ఆర్థిక ప్రణాళిక
మనకు వచ్చే బోనస్‌లను అనవసరమైన వాటికి కాకుండా ఆర్థిక స్థితిని పెంచే వాటి కోసం ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు దీర్ఘకాలిక వృద్ధిని ఇచ్చే వాటిల్లో పెట్టుబడి పెట్టాలి. పీపీఎఫ్, మ్యూచువల్ పండ్ వంటి వాటిపై పెట్టుబడి పెడితే భవిష్యత్‌లో ఆర్థికంగానే కాకుండా ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు ఉపయోగపడుతుంది.
పాలసీలు
ఆరోగ్య బీమాలను సమీక్షించాలి. పెరుగుతున్న వైద్య ఖర్చులకు తగిన విధంగా ఆరోగ్య బీమా ఉండటం చాలా అవసరం. ప్రసుత్తం ఉన్న పాలసీ అందుకు తగ్గట్లుగానే ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పెళ్లి అయినా, లేక పిల్లలు పుట్టిన వారికి కూడా వర్తించేలా బీమా కవరేజీని అంచనా వేసుకోవాలి.
అత్యవసర నిధిని పెంచుకోవాలి
మూడు నుంచి ఆరు నెలల వరకు ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా ఉండేలా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటూ నిధిని పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి.
కొత్త పెట్టుబడులు
మన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు ఉండాలి. మన ఆదాయానికి తగ్గట్టుగా ఏమైనా పెట్టుబడులు ఉన్నాయో చూడాలి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కాకుండా బంగారం, సావరిన్ గోల్డ్ బాండ్లు వంటి వాటిపై పెట్టుబడి పెడితే మంచి రాబడిని అందిస్తాయి.
2025లో పెద్ద లక్ష్యాల కోసం ప్లాన్
కొత్త ఇల్లు, మీ పిల్లల చదువుల, విదేశీ ప్రయాణాలు వంటి పెద్ద ప్లాన్స్ ఉన్నప్పుడు స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక అవసరం. ఉదాహరణకు కొత్త ఇంటి కోసం డౌన్ పేమెంట్ రూ.5 లక్షలు అవసరం అనుకుంటే ప్రతి నెల రూ.20వేలు ఆదా చేసుకోవాలి. ఇలా మనం అనుకున్న వాటి కోసం డిసెంబర్లో ఆర్థిక ప్రణాళికలు చేసుకుంటే 2025లో ఎటువంటి దిగులు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.