New Rupay Credit Card Rules 2024 :రూపే క్రెడిట్ కార్డులు మనదేశంలో ఎంతోమందికి చేరువయ్యాయి. అందుకే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపే క్రెడిట్ కార్డులకు సంబంధించి 3 సరికొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. అవి ఏమిటంటే?
పేమెంట్ చేసే టైంలోనే!
రూపే క్రెడిట్ కార్డును లింక్ చేసిన యూపీఐ యాప్‌లోనే ఇకపై యూజర్లు లావాదేవీలను ఈఎంఐలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. యూపీఐ యాప్‌లోని క్రెడిట్ కార్డు ఆప్షన్ నుంచి పేమెంట్ చేసే టైంలోనే ఈఎంఐ ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో తమకు అనువైన దాన్ని యూజర్లు ఎంపిక చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్, లిమిట్ మేనేజ్‌మెంట్ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి. రూపే క్రెడిట్ కార్డు యూజర్లు కావాలనుకుంటే ‘ఆటో పే’ ఆప్షన్‌ను వాడుకోవచ్చు. బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ జారీ సంస్థలు మే 31లోగా ఈ నయా ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.
అదనపు ఫీచర్లు ఇవీ!
ఎప్పుడైనా అవసరమైతే క్రెడిట్ లిమిట్ పెంచమని బ్యాంకుకు నేరుగా యూపీఐ యాప్ నుంచి రిక్వెస్టును పంపొచ్చు. క్రెడిట్ కార్డు ఔట్ స్టాండింగ్ బిల్, మినిమం బిల్, టోటల్ అమౌంట్, బిల్ డేట్ వంటివి యూపీఐ యాప్‌లోనే చూసుకోవచ్చు. ఇంతకుముందు బ్యాంక్ యాప్‌లో మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో ఉండేవి. కానీ ఇకపై ఇవి యూపీఐ యాప్‌ల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.
ప్రయోజనాలు!
RuPay Credit Card Benefits :రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో లింక్ చేయడం వల్ల పేమెంట్స్ చాలా సులభతరం అవుతాయి. ముఖ్యంగా ఒక చోట క్రెడిట్ కార్డు, మరో చోట యూపీఐ యాప్ వినియోగించాల్సిన అవసరం ఉండదు. మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు సులువుగా పేమెంట్స్ చేయవచ్చు. ప్రతిసారీ క్రెడిట్ కార్డును వెంట పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
రివార్డ్ పాయింట్స్ వస్తాయ్!
RuPay Credit Card Reward Points : సాధారణంగా క్రెడిట్ కార్డు పేమెంట్స్‌పై రివార్డు పాయింట్లు వస్తుంటాయి. అయితే బ్యాంక్ ఖాతా ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై మాత్రం ఎలాంటి రివార్డులు రావు. కానీ రూపే క్రెడిట్ కార్డు ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై రివార్డు పాయింట్లను కూడా పొందే అవకాశం ఉంటుంది.