New Income Tax Rules From April 1st 2024 :పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.నూతన ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానం అమల్లోకి రానుంది. ముఖ్యంగా ట్యాక్స్ స్లాబ్స్, రిబేట్స్, డిడక్షన్స్ మారనున్నాయి. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అమల్లోకి కొత్త పన్ను విధానం
New Tax Regime Default Adoption : 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా అమలులోకి రానుంది. ఐటీఆర్ ఫైలింగ్‌ను క్రమబద్ధీకరించడం, ప్రజలు సక్రమంగా పన్ను చెల్లించేలా ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. ఒక వేళ మీకు కొత్త పన్ను విధానం ప్రయోజనకరంగా లేకపోతే, పాత పన్నుల విధానాన్నే అనుసరించే స్వేచ్ఛ ఉంటుంది.
పన్ను రిబేట్
Elevated Basic Exemption Limit And Rebate : 2023 ఏప్రిల్ 1 నుంచి ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. అయితే ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 87A ప్రకారం, ఈ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. అందువల్ల ఏప్రిల్ 1 నుంచి రూ.7 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు అందరూ పూర్తి పన్ను రాయితీని పొందనున్నారు. అంటే వీరు ప్రభుత్వానికి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు.
2024-25 కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ఇలా ఉంటాయి
- రూ.3 లక్షల నుంచి 6 లక్షల ఆదాయం పొందే వారిపై 5% పన్ను విధిస్తారు.
- రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల ఆదాయం పొందే వారిపై 10%.
- రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల ఆదాయం పొందే వారిపై 15%.
- రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం పొందే వారిపై 20%.
- రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం పొందే వారిపై 30% ట్యాక్స్‌ను విధిస్తారు.
బేసిక్ డిడక్షన్ పునరుద్ధరణ
Restoration Of Basic Deduction : రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ పాత పన్ను విధానంలో ఉంది. దీనిని కొత్త పన్ను విధానంలోనూ చేర్చారు. కనుక 2024 ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానంలోనూ ఈ బేసిక్ డిడక్షన్ జరుగుతుంది. దీని వల్ల పన్ను చెల్లింపుదారులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.