New Income Tax Bill 2025 : భారత ఆదాయపు పన్ను వ్యవస్థలో కీలక మార్పులు రానున్నాయి. 'నూతన ఆదాయపు పన్ను బిల్లు-2025'ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం ఈ బిల్లును పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపనున్నారు. సంక్షిప్తంగా, సులభంగా చదవగలిగేలా ఉండే ఈ బిల్లులో 536 సెక్షన్లు, 23 అధ్యాయాలు, 622 పేజీలు ఉంటాయి. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపితే, ఆరు దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన 'ఆదాయపు పన్ను చట్టం-1961' చరిత్ర పుటల్లో కలిసిపోతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టంలో గత కొన్ని దశాబ్దాల్లో చాలా సవరణలు, మార్పులు, చేర్పులు జరిగాయి. దీంతో అది ఎంతో సంక్లిష్టంగా మారింది. ఇందులోని భాష, పదజాలం చదవలేని విధంగా కఠినంగా ఉన్నాయి.
ప్రీవియస్ ఈయర్, అసెస్‌మెంట్ ఈయర్‌లకు గుడ్‌బై
ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలోని 'గత ఏడాది' (ప్రీవియస్ ఈయర్) అనే పదాన్ని 'పన్ను సంవత్సరం' (ట్యాక్స్ ఈయర్) అనే పదంతో రీప్లేస్ చేయనున్నారు. 'అసెస్‌మెంట్ ఈయర్' (మదింపు సంవత్సరం)కు సంబంధించిన కాన్సెప్టును కూడా మార్చారు. ప్రస్తుతానికి 'గత సంవత్సరం' (2023-2024)లో మనం సంపాదించిన ఆదాయానికి 'మదింపు సంవత్సరం'(2024-25)లో పన్నును చెల్లిస్తాం. ఇందులో ఉన్న గత సంవత్సరం, మదింపు సంవత్సరం అనే కాన్సెప్టులను తొలగించారు. కేవలం 'పన్ను సంవత్సరం' (ట్యాక్స్ ఈయర్) అనే భావన మాత్రమే నూతన ఆదాయపు పన్ను బిల్లులో ఉంది.
సెక్షన్లు, షెడ్యూళ్లు, ఛాప్టర్లలో మార్పులివీ
నూతన ఆదాయపు పన్ను బిల్లులో 536 సెక్షన్లు ఉంటాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐటీ చట్టంలో సెక్షన్ల సంఖ్య 298 మాత్రమే. ప్రస్తుత చట్టంలో 14 షెడ్యూళ్లు ఉండగా, నూతన బిల్లులో 16 షెడ్యూళ్లు ఉంటాయి. ఛాప్టర్ల సంఖ్యలో ఎలాంటి మార్పూ లేదు. అవి స్థిరంగా 23గానే ఉన్నాయి. పేజీల సంఖ్యను గణనీయంగా తగ్గించి 622 చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టంలో సగానికిపైగా సవరణలు, మార్పులు, చేర్పులే. 1961లో ఆదాయపు పన్ను చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు, దానిలోని పేజీల సంఖ్య 880.