Monthly Income Scheme In Post Office :కష్టపడి సంపాదించిన సొమ్ముపై ఎంతో కొంత రాబడి రావాలని అందరూ భావిస్తుంటారు. అయితే, కొందరేమో రిస్క్ చేసి అధిక ఆదాయం వచ్చే పెట్టుబడుల్ని ఆశ్రయిస్తారు. మరికొందరు మాత్రం ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలని అనుకుంటారు. అలాంటి వారికోసం పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) మంచి ఎంపిక అవుతుంది. పెట్టుబడికి భద్రతతో పాటు స్థిరమైన నెలవారీ ఆదాయం పొందాలనుకొనేవారు ఈ స్కీమ్‌ను పరిశీలించొచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఉద్యోగ విరమణ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం కచ్చితమైన ఆదాయం పొందాలనుకొంటే ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
పోస్టాఫీసు అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒకటి. స్థిరమైన ఆదాయం అందించే పథకంగా మంచి ప్రజాదరణ పొందింది. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల పాటు నెలవారీ ఆదాయాన్ని పొందొచ్చు. పెట్టుబడిదారులు డిపాజిట్ చేసిన సొమ్ముకు మార్కెట్‌తో సంబంధం ఉండదు అందువల్ల మీ డిపాజిట్ సేఫ్‌గా ఉంటుంది. ఈ పథకంలో డిపాజిట్ చేయాలనుకుంటే ఈ స్కీమ్ అర్హతలు, వడ్డీ, మెచ్యూరిటీ సహా తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.
- పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఖాతాను ఎవరైనా సరే వ్యక్తిగతంగా, జాయింటుగా (గరిష్ఠంగా ముగ్గురు వ్యక్తులు) ఓపెన్ చేయవచ్చు. 10 ఏళ్లు నిండిన పిల్లల పేరుపై గార్డియన్ (మైనర్ ఖాతా) ఖాతా తెరవొచ్చు.
- ఈ పథకంలో కనీసం రూ.1,000 పెట్టుబడిగా పెట్టొచ్చు. సింగిల్ ఖాతాలో గరిష్ఠంగా రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్ఠంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు.
- ప్రస్తుతం ఈ పథకంపై 7.4 శాతం వడ్డీ అందిస్తున్నారు. మెచ్యూరిటీ పూర్తయ్యేవరకు ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తారు. అయితే, ఈ పథకం కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.
- ఎంఐఎస్ ఖాతా తెరిచిన తర్వాత ఐదేళ్లకు మెచ్యూరిటీ పూర్తవుతుంది. ఒకవేళ ముందస్తు ఉపసంహరణ చేస్తే నిబంధనల ప్రకారం వడ్డీపై కొంత శాతాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
- ఉదాహరణకు మీకు నెలవారీ రూ.5,550 ఆదాయం రావాలనుకుంటే రూ.9 లక్షలు ఎంఐఎస్ స్కీమ్‌లో డిపాజిట్ చేయాలి.
- ఇక జాయింట్ ఖాతా తెరిచి రూ.15 లక్షలు డిపాజిట్ చేసిన వారికి రూ.9,250 నెలవారీ ఆదాయం వస్తుంది. మీ నెలవారీ ఖర్చు, కావాలనుకొనే ఆదాయం ఆధారంగా పెట్టుబడి పెట్టవచ్చు.