Minimum Balance Norms For Saving Accounts : బ్యాంకులో మీరు పొదుపు ఖాతా ప్రారంభించాలంటే అందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. అయితే ఈ కనీస మొత్తం అనేది బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. ఒక వేళ మీ ఖాతాలో ఈ మినిమం బ్యాలెన్స్ లేకపోతే, సదరు బ్యాంకులు పెనాల్టీలు విధించే అవకాశం ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతాను మేనేజ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికే ఇలా చేస్తుంటాయి.
ఒక నివేదిక ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదేళ్లలో, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని ఖాతాదారుల నుంచి ఏకంగా రూ.8,495 కోట్లను పెనాల్టీల రూపంలో ఛార్జ్ చేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నేళ్ల ముందు ఈ విధమైన పెనాల్టీలను రద్దు చేసింది. కానీ ఇతర బ్యాంకులు వీటిని ఛార్జ్ చేస్తూనే ఉన్నాయి.
మినిమం బ్యాలెన్స్ అంటే ఏమిటి?
ఒక్కో బ్యాంకు నిబంధనల ప్రకారం మీరు ఓపెన్ చేసినసేవింగ్స్ అకౌంట్లో నిర్దిష్ట కనీస మొత్తాన్ని ఎప్పుడూ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీనినే మినిమం బ్యాలెన్స్ అని అంటారు. ఒక వేళ ఈ కనీస మొత్తం కంటే, మీ ఖాతాలో డబ్బులు తక్కువగా ఉంటే, సదరు బ్యాంకు మీ నుంచి పెనాల్టీ వసూలు చేసే అవకాశం ఉంటుంది. అయితే పెనాల్టీలు ఆయా బ్యాంకులను బట్టి మారుతుంటాయి. అంతేకాదు మీ ఖాతా రకం, సదరు బ్యాంక్ అందిస్తున్న ఉచిత సేవలు మొదలైన వాటిపై కూడా ఆధారపడి ఉంటుంది. కనుక ఇప్పుడు ఏయే బ్యాంకుల్లో ఎంత మినిమం బ్యాలెన్స్ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)
SBI Savings Account Minimum Balance :ఎస్బీఐ ఖాతాదారులు తమ సేవింగ్స్ అకౌంట్లో ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనక్కరలేదు. ఎందుకంటే 2020లోనే ఈ విధమైన పెనాల్టీలను ఎస్బీఐ రద్దు చేసింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్
HDFC Savings Account Minimum Balance :మెట్రో, అర్బన్ ఏరియాల్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో మీరు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే, కనీసం రూ.10,000ను మినిమం బ్యాలెన్స్‌గా మెయింటైన్ చేయాలి. లేదా ఒక లక్ష రూపాయలను ఒక సంవత్సరం + 1 రోజు కాలవ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. సెమీ అర్బన్ ఏరియాల్లో అయితే, మీ ఖాతాలో కనీస మొత్తంగా రూ.5000 ఉంచాలి. లేదా రూ.50,000ను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఒకవేళ మీ ఖాతాలో ఈ మినిమం బ్యాలెన్స్ లేకపోతే, తక్కువైన మొత్తంపై 6 శాతం వరకు పెనాల్టీ విధిస్తారు. లేదా రూ.600 ఛార్జ్ చేస్తారు. (వీటిలో ఏది తక్కువైతే అది వసూలు చేస్తారు.)