తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లో మైక్రోసాఫ్ట్ రూ.25,000 కోట్లు ఇన్వెస్ట్​మెంట్​​​​- క్లౌడ్, ఏఐ విస్తరణే టార్గెట్ - MICROSOFT INVESTMENT IN INDIA

భారత్​లో మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు- ప్రకటించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

satya Nadella
satya Nadella (Getty Image)

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2025, 3:21 PM IST

Updated : Jan 7, 2025, 3:30 PM IST

Microsoft Investment In India : క్లౌడ్, ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం భారత్​లో మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.25,712 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్​ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. అలాగే, 2030 నాటికి కోటి మందికి ఏఐ స్కిల్స్​పై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బెంగళూరు వేదికగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు.

'ఈ పెట్టుబడులు ఏఐ ఆవిష్కరణల కోసమే'
2030 నాటికి 10 మిలియన్ల మందికి ఏఐ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించారు. ఎన్నడూ లేని విధంగా 3 బిలియన్‌ డాలర్లును పెట్టుబడిగా పెడుతున్నందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పెట్టుబడి భారత్​లో ఏఐ ఆవిష్కరణలకు ఊతం ఇస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్ ప్రాంతీయ విస్తరణకు పెద్దపీట వేస్తోందని తెలిపారు.

"భారతదేశంలో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉంది. దేశంలోని నలుమూలలా ఏఐ, క్లౌడ్ విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నాం. 2025 నాటికి 2 మిలియన్ల మందిని ఏఐ నిపుణులగా తీర్చిదిద్దుతామని గతంలోనే ప్రకటించాం. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఏఐ స్కిల్స్​పై శిక్షణ ఇస్తాం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో భారతీయ నిపుణులు ముందు వరుసలో ఉంటారు. ఏఐ ఆవిష్కరణలలో భారత్ పురోగమిస్తోంది." అని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు.

మోదీతో భేటీ
ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సోమవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కృత్రిమ మేధ సాంకేతికతలో భారత్​ను ఉన్నత స్థానంలో నిలిపేందుకు తాము కలిసి పనిచేస్తామని తెలిపారు. ప్రతి భారతీయుడు ఏఐ ప్రయోజనాలను పొందేలా చూడాలన్నది తమ ఆకాంక్షగా వివరించారు.

"భారత్​లో మైక్రోసాఫ్ట్‌ విస్తరణ, పెట్టుబడి ప్రణాళికల గురించి తెలుసుకోవడం సంతోషకరంగా అనిపించింది. టెక్, ఇన్నోవేషన్, ఏఐ తదితర అంశాలపై జరిపిన చర్చలు అద్భుత ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నా" అని సత్య నాదెళ్లతో భేటీ అనంతరం ప్రధాని మోదీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

Last Updated : Jan 7, 2025, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details