తెలంగాణ

telangana

ETV Bharat / business

63శాతం పెరిగిన సత్య నాదెళ్ల వేతనం- మొత్తం ఎంతంటే? - SATYA NADELLA COMPENSATION

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం 63శాతం పెరిగినట్లు తెలిపిన కంపెనీ

Satya Nadella Compensation
Satya Nadella Compensation (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2024, 11:23 AM IST

Updated : Oct 25, 2024, 12:05 PM IST

Satya Nadella Compensation 2024 :ప్రముఖ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన 79.1 మిలియన్‌ డాలర్ల(ఇండియన్ కరెన్సీలో రూ.665 కోట్లకుపైగా) వేతనం అందుకోనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న 48.5 మిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది 63 శాతం ఎక్కువ.

మైక్రోసాఫ్ట్‌లో అందించిన సేవలకు గాను సత్య నాదెళ్లకు 5.2 మిలియన్‌ డాలర్లు నగదు ప్రోత్సాహకం అందనున్నట్లు కంపెనీ ఫైలింగ్​లో తెలిపింది. అయితే ఆయనకు రావాల్సిన 10.7 మిలియన్‌ డాలర్ల కంటే ఇది తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా ప్రోత్సాహకం తగ్గినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సీఈఓగా గత పదేళ్ల కాలంలో సత్య నాదెళ్ల వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. అనేక విషయాల్లో కీలక పాత్ర పోషించారు.

నాదెళ్ల అడుగుపెట్టడానికి ముందు వరకు మైక్రోసాఫ్ట్‌ మందగమనంతో సాగింది. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ విలువ కూడా శరవేగంగా పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్‌ వాటాదార్ల సంపద 2.8 ట్రిలియన్‌ డాలర్లకు పెరగడం గమనార్హం. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు పెట్టి మైక్రోసాఫ్ట్‌ షేర్లు కొనుగోలు చేస్తే, ఆ షేర్ల విలువ ఇప్పుడు 1,13,000 డాలర్లకుపైగా ఉంది.

గత ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్‌ వృద్ధిలో దూసుకెళ్లింది. దీంతో కంపెనీ షేర్లు దాదాపు 31.2 శాతం లాభపడ్డాయి. అలా మైక్రోసాఫ్ట్‌ మార్కెట్ విలువ 3 ట్రిలియన్‌ డాలర్లను దాటింది. దీంతో నాదెళ్ల స్టాక్‌ అవార్డులు 39 మిలియన్‌ డాలర్ల నుంచి 71 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. కృత్రిమ మేధ (AI) రేసులో రాణించేందుకు కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ ఏఐలో పెట్టుబడులు పెట్టింది.

Last Updated : Oct 25, 2024, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details