Life Insurance Company Claim Settlement Ratio :అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేదే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఉన్నంత వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ ఉండవు. ఆ వ్యక్తి దూరమైతే కుటుంబంలోని సభ్యులు ఎవరిపైనా ఆధారపడకుండా ఉండేందుకు జీవిత బీమా పాలసీ సాయపడుతుంది. ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఈ కారణంగానే చాలా మంది పాలసీని తీసుకోవడానికి మక్కువ చూపుతున్నారు. దీన్ని కొనుగోలు చేయడానికి కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలను ఎంపిక చేసుకునే ముందు క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో గురించి తెలుసుకోవాలి. అసలేంటీ రేషియో? బీమా ఎంపికలో ఎలా ఉపయోగపడుతుంది?
క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో
ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన క్లెయిమ్‌లు, వాటిలో ఎన్ని పరిష్కరించారో తెలిపేదే క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో. ఇదొక థంబ్ రూల్ లాంటిది. ఈ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే ఆ సంస్థ ఎక్కువగా బీమా క్లెయిమ్‌లను పరిష్కరించిందని అర్థం. అదే తక్కువ ఉంటే క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నట్లు లేదా ఆలస్యం చేస్తోందని అర్థం. ఎంత సంఖ్యలో క్లెయిమ్‌లు పూర్తి చేశారు? ఎంత మొత్తం చెల్లింపులు చేశారనేది బీమా కంపెనీ పనితీరును సూచిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక కంపెనీలు జీవిత బీమా పాలసీలు అందిస్తున్నాయి. వీటిని ఎంపిక చేసుకోవడంలో ఈ రేషియో ఉపయోగపడుతుంది.
IRDAI తాజా డేటా
జీవిత బీమా సంస్థల క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో వివరాలను (2022-23) భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) తాజాగా విడుదల చేసింది. అందులో డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో 98.45 శాతంగా పేర్కొంది. మొత్తంగా చూసినప్పుడు 98 శాతంగా ఉంది. క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ రేషియో పరంగా చూస్తే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ 99.51 శాతంతో మొదటి స్థానంలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 99.39 శాతం, ఏగాన్ 99.37 శాతంతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. క్లెయిమ్ సెటిల్‌మెంట్ మొత్తం పరంగా చూస్తే (క్లెయిమ్ చేసిన మొత్తం: చెల్లించిన మొత్తం) ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ 99.37 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. అవివా లైఫ్ ఇన్సూరెన్స్ 98.74 శాతంతో రెండులో, భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ 98.09 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి.