LIC Amritbaal Plan Launch :ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చిన్నారుల కోసం సరికొత్త పాలసీని ప్రవేశపెట్టింది. పిల్లల ఉన్నత చదువుల కోసం దీర్ఘకాలంపాటు మదుపు చేయాలని అనుకునే తల్లిదండ్రుల కోసం 'అమృత్‌బాల్' (ప్లాన్ నం.874) పాలసీని తీసుకువచ్చింది. ఇదొక నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. నేటి నుంచే (ఫిబ్రవరి 17) ఈ పాలసీని సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
అమృత్‌బాల్ పాలసీ ఫీచర్లు
ఎల్‌ఐసీ పిల్లల ఉన్నత చదువులను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల కోసం ఈ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇందులో అతి తక్కువ ప్రీమియం చెల్లింపు కాలవ్యవధి ఉంటుంది. అంతేకాదు ప్రీమియం మొత్తాన్ని ఒకేసారి చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. పైగా ప్రతి రూ.1000లకు రూ.80 వరకు గ్యారెంటీడ్ అడిషన్స్ లభిస్తాయి. ప్రీమియం టైమ్ పీరియడ్‌లో బీమా హామీ కూడా ఉంటుంది. ఈ పాలసీకి రైడర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ను తీసుకుంటే పిల్లలకు 18-25 ఏళ్ల వచ్చే సరికి పాలసీ మెచ్యూర్ అవుతుంది. వారి ఉన్నత చదువులకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఎవరు చేరవచ్చు!
- చిన్నారుల కోసం ఉద్దేశించిన ఈ అమృత్‌బాల్ పాలసీని తీసుకోవడానికి చిన్నారి వయస్సు కనీసం 30 రోజులు ఉంటే సరిపోతుంది. ఈ పాలసీ తీసుకోవడానికి గరిష్ఠ వయో పరిమితి 13 ఏళ్లు. పాలసీ మెచ్యూరిటీ కనిష్ఠంగా 18 ఏళ్లు, గరిష్ఠంగా 25 ఏళ్లు వరకు ఉంటుంది.
- ఈ చిల్డ్రన్ పాలసీకి అతి తక్కువ ప్రీమియం చెల్లింపు కాలవ్యవధి ఉంటుంది. ప్రధానంగా 5 ఏళ్లు, 6 ఏళ్లు, 7 ఏళ్ల కాలవ్యవధితో ప్రీమియం ఎంచుకోవచ్చు. ఈ ఎల్‌ఐసీ చిల్డ్రన్ పాలసీలో సింగిల్ ప్రీమియం చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే, కనీస పాలసీ టర్మ్ 5 ఏళ్లు ఉంటుంది. గరిష్ఠంగా 25 ఏళ్ల పాలసీ టర్మ్‌ను కూడా ఎంచుకోవచ్చు.
- ఈ అమృత్‌బాల్ పాలసీలో కనీస సమ్ అష్యూరెన్స్ రూ.2 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మీ ప్రీమియం చెల్లింపు సామర్థ్యం ఆధారంగా మీకు నచ్చిన మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
- ఎంచుకున్న బీమా హామీ మొత్తానికి, ప్రతి రూ.1000లకు పాలసీ చెల్లుబాటులో ఉన్నంత కాలం ఏటా రూ.80 చొప్పున యాడ్ అవుతూ ఉంటుంది.
- పాలసీ చెల్లించే సమయంలో పాలసీదారుడికి దురదృష్టవశాత్తు జరగరానిది ఏమైనా జరిగితే, డెత్ బెన్‌ఫిట్స్‌ను నామినీకి అందజేస్తారు. అలాగే, గ్యారెంటీడ్ అడిషన్స్ కింద అప్పటి వరకు జమ అయిన మొత్తాన్ని చెల్లిస్తారు.
రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు!
ఈ అమృత్‌బాల్ పాలసీకి రైడర్లను కూడా జత చేసుకోవచ్చు. ప్రీమియం బెన్‌ఫిట్ రైడర్‌ను ఎంచుకుంటే, ఒకవేళ ప్రపోజర్‌కు జరగరానిది ఏమైనా జరిగితే, మిగిలిన కాలవ్యవధిలో చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ఎల్‌ఐసీ సంస్థయే చెల్లిస్తుంది.