Tips to Remove Dead Rat Smell : ఇంట్లోకి ఒక్క ఎలుక దూరిందా.. కొన్ని రోజుల్లోనే పెద్ద సైన్యంగా మారి నానా విధ్వంసం సృష్టిస్తుంటాయి. ఈ క్రమంలో చాలా మంది వాటి బెడద వదిలించుకోవడానికి రకరకాల పద్ధతులు ఫాలో అవుతుంటారు. అందులో భాగంగానే కొందరు ఎలుకల మందు పెట్టి చంపుతుంటారు. అలా చేసినప్పుడు కొన్నిసార్లు అది తిన్న ఎలుకలు ఇంట్లో ఏదో మూలన నక్కి చనిపోతుంటాయి.
అప్పుడు ఎలుక ఎక్కడ చనిపోయిందో గుర్తించకపోతే.. దాని నుంచి వచ్చే వాసనతో ఇంట్లో ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, అలాంటి టైమ్‌లో ఈ నేచురల్ టిప్స్ ఫాలో అవ్వండి. నిమిషాల్లో ఎలుక చచ్చిన వాసనను వదలించుకోవడమే కాకుండా.. ఇంటిని మంచి సువాసనభరితంగా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కాఫీ పొడి : చనిపోయిన ఎలుకల వాసనను పోగొట్టడంలో కాఫీ పొడి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఎటువైపు నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ కాఫీ పొడిని మందపాటి పొరలో చల్లుకోవాలి. లేదంటే.. వాటర్‌లో కొద్దిగా కాఫీ పొడిని మిక్స్ చేసి చల్లినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
పుదీనా ఆయిల్ : ఇది ఎలుక చచ్చిన వాసనను వదిలించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. దీనికోసం ఒక స్ప్రే బాటిల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పుదీనా నూనె(పిప్పరమెంట్ ఆయిల్) వేసుకొని కలుపుకోవాలి. ఆపై దాన్ని దుర్వాసన వచ్చే ప్రాంతాల్లో స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పుదీనా నూనె ఘాటు, బలమైన వాసనకు ఎలుక చచ్చిన స్మెల్ దెబ్బకి వదిలిపోయి.. ఇల్లంతా మంచి సువాసనతో నిండు కుంటుందంటున్నారు.
యూకలిప్టస్ ఆకులు : చనిపోయిన ఎలుకల నుంచి వచ్చే వాసనను వదిలించుకోవడానికి ఇదీ మరొక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా బ్యాడ్ స్మెల్ వచ్చే ప్రదేశాల్లో కొన్ని ఎండిన యూకలిప్టస్ ఆకులు తీసుకొని వాటిని మండిస్తే సరి. అప్పుడు వచ్చే యూకల్టిపస్ ఆకుల పొగ ప్రభావిత ప్రాంతాల్లో చేరి దుర్వాసనను సంగ్రహించి.. ఇంటిని సువాసనభరితంగా మార్చుతుందంటున్నారు నిపుణులు.
న్యూస్ పేపర్ : ఇది కూడా ఎలుకలు చచ్చిన వాసనను తొలగించుకోవడానికి మరో సింపుల్ చిట్కా. ఇందుకోసం ఇంట్లో పాత న్యూస్ పేపర్స్ ఉంటే చాలు. బ్యాడ్ స్మెల్ వచ్చే ప్రాంతాల్లో న్యూస్ పేపర్ పరిచి 2 నుంచి 3 గంటలు అలా వదిలేయాలి. అప్పుడు వార్తాపత్రికలో ఉన్న సిరా చనిపోయిన ఎలుకల నుంచి వచ్చే వాసనను సంగ్రహించి దుర్వాసనను తరిమికొడుతుందని నిపుణుల అభిప్రాయం.
బొగ్గు : ఇది ఇతర పదార్థాల వాసనను సులువుగా గ్రహిస్తుంది. కాబట్టి చనిపోయిన ఎలుక వాసనను పోగొట్టడంలో బొగ్గు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇందుకోసం ప్రభావిత ప్రాంతాన్ని క్లీన్ చేశాక.. ఒక చిన్న బౌల్లో కొద్దిగా బొగ్గును తీసుకొని మండించి అక్కడ వదిలేయాలి. ఇలా చేయడం ద్వారా బొగ్గు బ్యాడ్ స్మెల్ని సంగ్రహిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
దుర్వాసనల్ని తొలగించుకోవచ్చు : ఈ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా కేవలం చనిపోయిన ఎలుకల నుంచి వచ్చే వాసనను మాత్రమే కాదు.. ఇంట్లో వచ్చే ఇతర దుర్వాసనల్ని ఈజీగా వదలించుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఇవీ చదవండి :
మీ ఇంట్లో ఎలుకలు దూరి ఇబ్బంది పెడుతున్నాయా? - ఈ టిప్స్ పాటిస్తే నిమిషాల్లో పరార్!
ఎన్ని చేసినా ఇంటి నుంచి బల్లులు పోవడం లేదా - ఈ టిప్స్ పాటిస్తే వాటిని తరిమికొట్టడం వెరీ ఈజీ!