Karthika Puranam 22nd Day In Telugu Pdf : కార్తిక పురాణంలో భాగంగా అత్రి మహాముని అగస్త్య మహామునుల సంవాదమును గురించి జనకునితో ఇంకను వివరిస్తూ వశిష్ఠులవారు చెప్పిన ఇరవై రెండవ రోజు కథా విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
కార్తిక వ్రతం ఆచరించిన పురంజయుడు
వశిష్ఠులవారు జనక మహారాజుతో అత్రి అగస్త్యుల సంవాదమును గురించి వివరిస్తూ ఇరవై రెండవ రోజు కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు. పురంజయుడు వశిష్ఠులవారు చెప్పిన ప్రకారం కార్తిక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి, శ్రీహరిని గానము చేసి, సాష్టాంగ నమస్కారం చేసి, సూర్యోదయం కాగానే నదికి పోయి, స్నానమాచరించి తన గృహమునకు వెళ్లెను.
పురంజయుని విష్ణువు సాక్షాత్కారం
పురంజయుడు నదీ స్నానం చేసి తిరిగి వస్తున్న సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమీపించి "ఓ రాజా! విచారింపకుము. నీవు వెంటనే చెల్లాచెదురై ఉన్న నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడవై శత్రురాజులపై యుద్ధానికి బయలుదేరుము నీ రాజ్యం నీకు దక్కును. విజయోస్తు". అని దీవించి అదృశ్యమయ్యెను. వెంటనే పురంజయుడు "ఇతనెవరో మహానుభావుడు వలే ఉన్నాడు" అని అతని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రు రాజులతో ఘోరముగా పోరాడెను.
పురంజయునికి విజయప్రాప్తి
ఒకసారి దెబ్బతిన్న క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము యొక్క ధాటికి శత్రురాజుల సైన్యం మొత్తం మట్టి కరిచింది. అంతేకాక శ్రీమన్నారాయణుని ఆశీర్వాద బలము కూడా పురంజయుని విజయానికి కారణమయ్యింది. శ్రీమన్నారాయణుని కరుణకు అంతు లేదు కదా! శ్రీమన్నారాయణుని కటాక్షమును పొందిన వారికి అపజయము ఉండదు కదా! పురంజయుడు విజయాన్ని పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. ఆ యుద్ధంలో కాంభోజాది రాజులు ఓడిపోయి "ఓ పురంజయా! మమ్మల్ని రక్షింపుము" అని కేకలు వేయుచు పారిపోయిరి.
శ్రీహరి కటాక్షం ఉంటే సర్వత్రా జయం
శ్రీహరి కటాక్షం ఉంటే అసాధ్యములు కూడా సుసాధ్యములే కదా! హరినామ స్మరణ చేసిన శత్రువు కూడా మిత్రుడగును. అధర్మము కూడా ధర్మమగును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. తాడు కూడా పామై కరుచును.
విష్ణు భక్తియే శరణ్యం!
కార్తిక మాసమంతా నదీ స్నానం చేసి దేవాలయంలో దీపారాధన చేసినచో సకల ఆపదలు తొలగి పోవును. విష్ణు భక్తి తో ఈ వ్రతమును ఆచరించేవారు ఏ జాతి వారైనా వారికి పుణ్యప్రాప్తి కలుగును. కానీ బ్రాహ్మణ జన్మను ఎత్తి కూడా విష్ణు భక్తితో కార్తిక వ్రతము చేయనివాడు మోక్షాన్ని పొందలేడు. సంసారమనెడి సాగరం నందు తరించుటకు విష్ణుభక్తి ఒక్కటే మార్గము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాదిమునులు, మరెందరో రాజులు విష్ణు భక్తి చేత ముక్తిని పొందారు. భక్తవత్సలుడైన శ్రీహరి పుణ్యాత్ములను సదా కాపాడుతుంటాడు. కార్తిక వ్రతము చేయుటకు అవకాశము లేనివారు ఎవరికైనా ధనము ఇచ్చి వారి చేత నైనా దానధర్మములు, వ్రతములు చేయించవచ్చును. శ్రీహరికి భక్తులకు గల సంబంధం అవినాభావం. అందుకే ఆ శ్రీహరి తన భక్తులకు ఎల్లపుడు సంపదలను ఇచ్చి కాపాడుతుంటాడు.
కార్తిక వ్రతంతో లక్ష్మీ కటాక్షం
సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు వేయి సూర్యుల తేజస్సు గలవాడు. అటువంటి శ్రీహరికి ప్రీతికరమైన కార్తిక మాస వ్రతమును ఎవరు భక్తిశ్రద్దలతో చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి స్థిరముగా ఉంటాడు. ఆ ఇల్లు ఎల్లప్పుడూ సిరిసంపదలతో కళకళలాడుతూ ఉంటుంది. కార్తిక మాసంలో శుచియై పురాణ పఠనము చేసిన యెడల పితృదేవతలు సంతోషించడమే కాకుండా వారి వంశం మొత్తం తరిస్తుంది. ఇది ముమ్మాటికీ నిజము". అని అత్రి మహాముని అగస్త్యునితో చెప్పారు. ఈ విధంగా అత్రిముని అగస్త్యుల వారితో చెప్పిన కార్తిక మహాత్యమును వివరిస్తూ వశిష్ఠులవారు ఇరవై రెండవ రోజు కథను ముగించాడు. ఇతి స్కాంద పురాణే! కార్తిక మహాత్మ్యే! ద్వావింశాధ్యాయ సమాప్తః ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.