Jeff Bezos Success Secret : ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలలో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ ఒకరు. అమెజాన్ సంస్థను వృద్ధి పథంలో నడిపించడంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. ఎప్పటికప్పుడు సవాళ్లను స్వీకరిస్తూ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దారు. అందుకే జెఫ్ బెజోస్ ఆచరిస్తున్న నిర్వహణ వ్యూహాల గురించి ఎల్లప్పుడూ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అందులో ఒకటి ప్రతి అమెజాన్ సమావేశంలోనూ ఒక కుర్చీని ఖాళీగా ఉంచడం. ఇంతకీ ఆయన ఎందుకు అలా చేసేవారో తెలుసా?
కస్టమర్లకే మొదటి ప్రాధాన్యం!
బిలియనీర్ జెఫ్ బెజోస్ నిర్వహించే ప్రతీ సమావేశంలోనూ ఒక కుర్చీ ఖాళీగా ఉంటుంది. ఆ కుర్చీ కస్టమర్లను గుర్తుచేస్తుంది. అంటే ఈ ఖాళీ కుర్చీ కస్టమర్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తూ, వారి దీర్ఘకాలిక అంశాలపై దృష్టిపెట్టాలని అమెజాన్ బృందానికి రిమైండర్‌గా పని చేస్తుందని బెజోస్ నమ్ముతారు. ఈ ఆచరణ బయట వ్యక్తులు చూసేందుకు విచిత్రంగా అనిపించినప్పటికీ, దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
తక్కువ మందితో సమావేశాలు!
తక్కువ మందితో సమావేశాలు నిర్వహించడం వల్ల చర్చలు బాగా జరుగుతాయని, సరైన నిర్ణయాలు తీసుకోగలమని జెఫ్ బెజోస్ భావిస్తారు. ఎక్కువ మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ సంభాషణ నీరుగారిపోతుందని ఆయన భావన. అందుకే ఆయన కేవలం 6 నుంచి 8 మంది సభ్యులతోనే సమావేశాలు ఏర్పాటు చేసేవారు.