Nissan Honda Merger :జపాన్‌కు చెందిన ప్రఖ్యాత వాహన తయారీ సంస్థలు హోండా, నిస్సాన్, మిత్సుబిషి వ్యాపారాల విలీనంపై జరుపుతున్న చర్చలు ఆగిపోయాయి. ఇక ఈ చర్చలను ఇంతటితో ఆపేయాలని మూడు కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఈమేరకు మూడు కంపెనీలు గురువారం ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
'విలీన చర్చలను ఇక మేం ఆపేస్తున్నాం. అయితే ఎలక్ట్రిక్ వాహన తయారీ విభాగం కలిసి పనిచేయడాన్ని కొనసాగిస్తాం. మా మూడు కంపెనీలు కలిసిమెలిసి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల విభాగాల్లో పరస్పర సహకారాన్ని అందించుకుంటాయి' అని హోండా, నిస్సాన్ స్పష్టం చేశాయి.
నిస్సాన్‌కు దక్కని ఊరట
సంయుక్త హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరుపుతున్నామని హోండా మోటార్, నిస్సాన్ మోటార్ కంపెనీలు 2024 డిసెంబరులో ప్రకటించాయి. ఆ సంయుక్త హోల్డింగ్ కంపెనీలో చేరే అంశాన్ని తాము కూడా పరిశీలిస్తున్నామని మిత్సుబిషి కంపెనీ వెల్లడించింది. హోండా, నిస్సాన్, మిత్సుబిషి కలిసి టయోటా, ఫోక్స్ వ్యాగన్, జనరల్ మోటార్స్, ఫోర్డ్‌కు ధీటుగా పెద్ద వాహన గ్రూపును ఏర్పాటు చేయాలని అప్పట్లో సంకల్పించాయి. ఒకవేళ ఈ విలీనం జరిగి ఉంటే జపాన్‌లోని రెండో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ నిస్సాన్‌కు ఊరట దక్కి ఉండేది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఈ కంపెనీ కార్ల అమ్మకాలు చైనా, అమెరికాల్లో బాగా తగ్గిపోయాయి. కీలక స్థానాల్లోని ఉన్నతాధికారులు అకస్మాత్తుగా వైదొలిగారు. ఈ నేపథ్యంలో 2024 నవంబరులో నిస్సాన్ కీలక ప్రకటన చేసింది. వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
చైనా కంపెనీల పోటీని ఎదుర్కొనేందుకే
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో బీవైడీ (BYD) లాంటి చైనా కంపెనీల హవా నడుస్తోంది. వాటి నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ కారణంగా చాలా కార్ల తయారీ కంపెనీలు ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఈ పోటీని తట్టుకునేందుకే గతేడాది మార్చి నెలలో తొలిసారిగా నిస్సాన్, హోండా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి.
'చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలకు పోటీ ఇచ్చేలా మేం తయారు కావాలి. 2030 నాటికి మేం మా సామర్థ్యాలను ఆ మేరకు పెంచుకోవాలి. దీనిపైనే మేం దృష్టి పెడతాం. లేదంటే మేం దెబ్బతింటాం' అని అప్పట్లో హోండా సీఈఓ తోషిహిరో మైబ్ వ్యాఖ్యానించారు. దీనిపై ఆనాడు తైవాన్ టెక్ కంపెనీ ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లీయూ స్పందించారు. నిస్సాన్ కంపెనీ షేర్లను కొనేందుకు మేం ఆసక్తిగా ఉన్నామని, అవసరమైతే మా సాయాన్ని తీసుకోవచ్చని ఆయన అప్పట్లో ప్రకటించారు. మొత్తం మీద చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలను ఎదుర్కొనేందుకు సంయుక్త వ్యూహరచన చేసే దిశగా హోండా, నిస్సాన్, మిత్సుబిషి ముందడుగు వేయలేకపోయాయి.