ITR Filing Tips : ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయడం చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వారికి ఐటీ చట్టాలపై సరైన అవగాహన ఉండదు. దీనితో తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఫలితంగా పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఈ ఆర్టికల్‌లో ఐటీఐర్ దాఖలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
1. వ్యక్తిగత సమాచారంలో తప్పులు ఉండకూడదు!
ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మీ వ్యక్తిగత వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలి. మీ పూర్తి పేరు, పాన్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ లాంటి వివరాల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. లేదంటే ప్రాసెసింగ్ ఆలస్యం అవుతుంది. లేదా ఆదాయ పన్ను రిటర్న్‌ల్లో సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే వ్యక్తిగత సమచారాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం ఉత్తమం.
2. ఫారమ్ 26AS, ఫారమ్ AIS మధ్య సమన్వయం ఉండాలి!
ఐటీఆర్ ఫైలింగ్‌లో పారదర్శకతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం వార్షిక సమాచార ప్రకటన (AIS)ను ప్రవేశపెట్టింది. కనుక పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ వివరాలను ఫారమ్ ఏఐఎస్, ఫారమ్ 26ఏఎస్‌ల్లో ఒకేలా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే వాటిలో తగు సవరణలు కూడా చేసుకోవాలి.
3. మీ అన్ని ఆదాయ వనరుల గురించి తెలియజేయాలి!
చాలా మంది ఐటీఆర్‌లు దాఖలు చేస్తారు కానీ, వారి ఆదాయ వనరుల గురించి తెలియజేయరు. దీని వల్ల వారికే నష్టం ఏర్పడుతుంది. అందువల్ల జీతం, అద్దె ఆదాయం, వడ్డీ ఆదాయం, మూలధన లాభాలు, వ్యాపార ద్వారా వచ్చే ఆదాయం ఇలా అన్ని మార్గాల ద్వారా వస్తున్న ఆదాయ వివరాలను ఐటీఆర్‌లో పేర్కొనాలి. ఇలా చేయకపోతే, మీపై పెనాల్టీలు వేయవచ్చు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. కనుక మీకు ఏయే మార్గాల్లో ఆదాయం వస్తుందో, పూర్తిగా ఐటీఆర్‌లో తెలిపాలి.
4. డిడక్షన్లను క్లెయిమ్ చేయడం మర్చిపోకూడదు!
మెడికల్ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ, దాతృత్వ విరాళాలు లాంటి వాటికి పన్ను మినహాయింపులు లభిస్తాయి. కానీ చాలా మంది ఇది తెలియక, పన్ను మినహాయింపు (డిడక్షన్)లను క్లెయిమ్ చేయరు. దీని వల్ల వారు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. కనుక మీకు న్యాయబద్ధంగా రావాల్సిన పన్ను మినహాయింపులను కూడా ఐటీఆర్‌లో ఫైల్ చేయాలి. ముఖ్యంగా మీరు పాత పన్ను విధానాన్నే అనుసరిస్తూ ఉంటే, ట్యాక్స్ డిడక్షన్లను కచ్చితంగా క్లెయిమ్ చేసుకోవాలి.
5. తప్పనిసరిగా ఐటీఆర్ వెరిఫికేషన్ చేసుకోవాలి!
చాలా మంది ఐటీఆర్‌ను దాఖలు చేస్తుంటారు. కానీ దానిని వెరిఫికేషన్ ప్రాసెస్‌ను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. మీరు చాలా సింపుల్‌గా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. లేదా ఐటీఆర్-V ఫారంపై సంతకం చేసి, దాని కాపీని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)కు పంపించాలి. అది కూడా ఐటీఆర్ ఫైల్ చేసిన 120 రోజుల్లోనే పంపించాల్సి ఉంటుంది. ఇలా చేయకుంటే, మీ ఐటీఆర్ అనేది చెల్లకుండా పోతుంది. అందుకే సకాలంలో ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి.