Intel To Lay Off 18,000 Employees : అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. దాదాపు 18 వేల మందిని తొలగించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది దాదాపు 15 శాతానికి సమానం.
ఉద్యోగుల తొలగింపుల వల్ల ఇంటెల్ కంపెనీకి ఏటా 20 బిలియన్ డాలర్ల వ్యయాలు ఆదా అవుతాయని ఓ అంచనా. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. ‘‘రెండో త్రైమాసిక ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ఉత్పత్తులు, తయారీ ప్రక్రియలో అనేక మైలురాళ్లను సాధించినప్పటికీ, ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు’’ అని కంపెనీ సీఈఓ పాట్ గెల్సింగర్ ప్రకటించారు. రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్లతో కూడుకొన్న పరిస్థితులను ఎదుర్కోనున్నట్లు ఆయన తెలిపారు.
కారణం అదే!
కృత్రిమ మేధ (AI) ఆధారిత చిప్‌ల ఉత్పత్తిలో సవాళ్లు ఎదురవుతుండడం, తమ తయారీ కేంద్రాలకు ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోవడం వల్ల రెండో త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చాయని ఇంటెల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి డేవిడ్ జిన్సర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా లాభాలను మెరుగుపర్చుకోవటంతో పాటు, బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేసుకుంటామని ఆయన ప్రకటించారు.