E-commerce Draft Rules : ఐఫోన్ కోసం ఆర్డర్ ఇస్తే అగ్గిపెట్టె వచ్చింది - ఇలాంటి వార్తలు మనం తరచూ వింటూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో వినియోగదారులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. తాము ఆర్డర్ చేసిన వస్తువు రానందుకు మానసిక ఆవేదన ఉంటుంది. పైగా దానికి రీఫండ్ పొందడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి ఆన్లైన్ మోసాల నుంచి వినియోగదారులకు రక్షించే లక్ష్యంతో స్వీయనియంత్రణ చర్యలను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల కోసం ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది.
"ఈ-కామర్స్- ప్రిన్సిపల్స్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ సెల్ఫ్ గవర్నెన్స్" పేరుతో ఈ ముసాయిదా మార్గదర్శకాలను ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) జారీ చేసింది. ఈ ఫిబ్రవరి 15లోగా దీనిపై ఈ-కామర్స్ కంపెనీల అభిప్రాయాలు చెప్పాలని స్పష్టం చేసింది.
డ్రాఫ్ట్ రూల్స్ ఇవే!
ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం-- 'ఈ-కామర్స్ వేదికలు ఇకపై వినియోగదారుల సమ్మతిని పొందడం తప్పనిసరి. ముఖ్యంగా కస్టమర్ల ఆర్థిక లావాదేవీలు, ఆర్డర్ క్యాన్సిల్, రిటర్న్‌లు, రీఫండ్ కోసం పారదర్శక విధానాలను అవలంబించాలి. ఈ-కామర్స్ వేదికలు వినియోగదారులకు ప్రతి లావాదేవీకి సంబంధించిన పూర్తి రికార్డ్‌ను అందించాలి. క్రెడిట్/డెబిట్ కార్డ్, మొబైల్ పేమెంట్స్, ఇ-వాలెట్లు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ వంటి అన్ని పేమెంట్ ఆప్షన్స్ తప్పనిసరిగా ఇవ్వాలి.
ప్లాట్‌ఫామ్‌లు వసూలు చేసే ప్రాసెసింగ్ ఛార్జీలను కచ్చితంగా బహిర్గతం చేయాలి. సురక్షిత చెల్లింపుల కోసం ఎన్క్రిప్షన్, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ వ్యవస్థలు కచ్చితంగా ఏర్పాటు చేయాలి. పునరావృత చెల్లింపులు (రికరింగ్ పేమెంట్స్), సమయం, విరామం గురించి స్పష్టమైన వివరాలు అందించాలి. వినియోగదారులు కోరుకున్న విధంగానే క్యాష్ ఆన్ డెలివరీ రీఫండ్ చేయాలి.
కస్టమర్లకు సకాలంలో ఆర్డర్లను డెలివరీ చేయాలి. ఒకవేళ వినియోగదారులకు నకిలీ ఉత్పత్తులు అందజేస్తే, వాటిని వాపసు తీసుకుని, సరైన ప్రొడక్ట్ తిరిగి ఇవ్వాలి. ఇందుకు ఎంత సమయం పడుతుందో ముందే కచ్చితంగా చెప్పాలి.'