Indian Banking Sector Net Profit :తొలిసారిగా గత ఆర్థిక సంవత్సరం (FY24)లో బ్యాంకింగ్ రంగం నికర లాభం రూ.3 లక్షల కోట్లు దాటడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఇది దేశ బ్యాంకింగ్ రంగానికి అద్భుతమైన మలుపుగా ఆయన అభివర్ణించారు. "మేం అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలోని బ్యాంకులు మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తుల ఊబిలో ఉన్నాయి. యూపీఏ (ఇండియా) సర్కారు ఫోన్ బ్యాంకింగ్ వల్ల ఆనాడు బ్యాంకులకు ఆ కష్టం వచ్చింది. పేదల కోసం బ్యాంకుల తలుపులు మూసుకుపోయాయి" అని పేర్కొంటూ ప్రధాని మోదీ సోమవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
మా సర్కారు పనితీరు వల్లే పరిస్థితులు మారాయ్
"మేం పాలనా పగ్గాలు చేపట్టాక బ్యాంకులు గాడినపడ్డాయి. బ్యాంకుల నుంచి పేదలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, రైతులకు రుణాల మంజూరు పెరిగింది. మా సర్కారు పనితీరు వల్లే ఒకప్పుడు నష్టాల్లో ఉన్న భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు లాభాల్లోకి వచ్చింది. వాటి క్రెడిట్ రికార్డు స్థాయిలో వృద్ధి చెందింది" అని నరేంద్ర మోదీ తెలిపారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగ బ్యాంకులకు రూ. 1.78 లక్షల కోట్ల నికర లాభం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 1.41 లక్షల కోట్ల నికర లాభం వచ్చింది. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ ప్రైవేటు రంగ బ్యాంకులకు రూ.1.2 లక్షల కోట్ల నికర లాభం, ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ. 1.04 లక్షల కోట్ల నికర లాభం వచ్చింది.