తెలంగాణ

telangana

ETV Bharat / business

ధరల మంట ఎఫెక్ట్- ఈసారి జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతమే! - INDIAN GDP GROWTH RATE

ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిన పర్యవసానం- గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.2 శాతం- ఈసారి భారీగా పతనం- ఎన్ఎస్‌ఓ నివేదిక విడుదల చేసిన కేంద్రం

Indian GDP Growth Rate
Indian GDP Growth Rate (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2025, 5:54 PM IST

Indian GDP Growth Rate 2025 :భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో దాదాపు 6.4శాతం మేర వృద్ధిని సాధించే అవకాశం ఉందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్‌ఓ) అంచనా వేసింది. అయితే గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశం సాధించిన 8.2 శాతం జీడీపీ వృద్ధి రేటుతో పోలిస్తే ఇది తక్కువే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశం 6.6 శాతం జీడీపీ వృద్ధి చెందే అవకాశం ఉందని ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా వేసింది. ఈ లెక్కన జీడీపీ వృద్ధిరేటు విషయంలో ఆర్‌బీఐ కంటే 20 బేసిస్ పాయింట్లు మేర తక్కువ (6.4 శాతం) అంచనాలనే ఎన్ఎస్‌ఓ విడుదల చేసిందన్న మాట. ఈ మేరకు వివరాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జాతీయ ఆదాయ(గ్రాస్/నెట్ నేషనల్ ఇన్​కమ్) ముందస్తు అంచనాలతో తొలి నివేదికను ఎన్ఎస్ఓ రూపొందించింది. దీన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ మంగళవారం విడుదల చేసింది.
ఎన్ఎస్‌ఓ నివేదికలో కీలక అంశాలివీ

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో నామమాత్రపు జీడీపీ వృద్ధిరేటు 9.7 శాతంగా ఉండొచ్చని అంచనా. 2023-24లో ఇది 9.6 శాతంగా నమోదైంది.
  • గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (GVA) విభాగంలో వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి చేరొచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 7.2 శాతంగా నమోదైంది.
  • నామినల్ గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (నామినల్ జీవీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.3 శాతానికి చేరొచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 8.5 శాతంగా నమోదైంది.
  • వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన రియల్ జీవీఏ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతానికి చేరొచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 1.4 శాతం మాత్రమే.
  • వాస్తవిక జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.184.88 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.173.82 లక్షల కోట్లుగా నమోదైంది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024 జులై-సెప్టెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 5.4 శాతం మేర వృద్ధిని సాధించిందని నివేదిక తెలిపింది. ఆ త్రైమాసికంలో 7శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్‌బీఐ వేసిన అంచనా తలకిందులైంది. 2024 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనూ ఆర్‌బీఐ అంచనాలు నిజం కాలేదు. వృద్ధిరేటు పెరగకపోగా తగ్గిపోయింది.

జులై-సెప్టెంబరులో డౌన్ - అక్టోబరు-డిసెంబరులో రికవరీ
ద్రవ్యోల్బణపు ధరల మంట కారణంగా పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును మందగమనంలోకి నెట్టింది. ప్రత్యేకించి ఆహార ఉత్పత్తులు, సరుకుల ధరలు మండిపోవడం వల్ల ప్రజలు ఖర్చులను తగ్గించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా రెపో రేటును 6.5 శాతం వద్దే ఆర్‌బీఐ కొనసాగించింది. 2024 సంవత్సరం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు నెమ్మదించింది. అయితే దీని రికవరీ అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో జరిగిందని, ఆర్థిక వ్యవస్థ బాగానే కోలుకుందని ఆర్‌బీఐ తెలిపింది. ఈ త్రైమాసికంలో పండుగల సీజన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కొనుగోళ్లను పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుకు దన్ను లభించిందని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details