How to pay home loan faster: సొంతిల్లు ఉండాలనే కల ఎంతో మందికి ఉంటుంది. దీన్ని నిజం చేసుకునేందుకు చాలా మంది గృహరుణం తీసుకుంటూంటారు. అయితే కొంత కాలంగా రెపో రేటు స్థిరంగా ఉన్నప్పటికీ, బ్యాంకులు మాత్రం గృహరుణ వడ్డీ రేట్లను సవరిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి. అందుకే ఈ ఆర్టికల్లో గృహరుణాన్ని తొందరగా తీర్చేందుకు ఉన్న మార్గాలేమిటో తెలుసుకుందాం.
1. ముందే అంచనా వేసుకోవాలి!
దాదాపు 15-20 ఏళ్ల వ్యవధికి తీసుకున్న గృహరుణాన్ని వీలైనంత తొందరగా తీర్చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆర్థికంగా మిగతా విషయాలపై దృష్టి సారించేందుకు వీలవుతుంది. కొంతమంది నెలవారీ వాయిదాలు తక్కువగా ఉండేలా చూసుకోవడం కోసం వ్యవధిని పెంచుకుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో వడ్డీ భారం అధికం అవుతుంది. ఇంటి రుణం తీసుకునేటప్పుడే మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఎంత మేరకు ఈఎంఐ చెల్లించగలను? దీని ప్రభావం నా ఆర్థిక పరిస్థితిపై ఎలా ఉంటుంది? అని ముందుగానే ఆలోచించుకోవాలి.
ఉదాహరణకు మీరు 20 ఏళ్ల వ్యవధికి 8.5 శాతం వడ్డీ రేటుతో రూ.50 లక్షల గృహరుణాన్ని తీసుకుంటే, మీ నెలవారీ ఈఎంఐ సుమారు రూ.43,237 వరకు ఉంటుంది. దీనికి మొత్తం వడ్డీ దాదాపు రూ.54.13 లక్షల వరకు అవుతుంది. అంటే 20 ఏళ్లలో అసలు, వడ్డీ కలిపితే సుమారుగా మీరు రూ.1.04 కోట్లు చెల్లించాల్సి వస్తుంది.
ఒకవేళ ఈ రుణాన్ని 15 ఏళ్లలోనే తీర్చుకోవాలని అనుకుంటే, నెలవారీ వాయిదా మొత్తాన్ని కాస్త పెంచుకోవాలి. అంటే రూ.43,237కు బదులుగా రూ.49,237 చెల్లిస్తే, అప్పుడు వడ్డీ మొత్తం రూ.36.62 లక్షలే అవుతుంది. అప్పుడు మీరు చెల్లించే మెత్తం రూ.86.62 లక్షలు మాత్రమే. అంటే మీరు సుమారు రూ.6,000 అధికంగా చెల్లించడం వల్ల గృహరుణం తొందరగా తీరడమే కాకుండా, దాదాపు రూ.15.38 లక్షల వరకు ఆదా అవుతుంది. మీరు అధికంగా చెల్లించే ప్రతి రూపాయీ గృహరుణం అసలుకు జమ అవుతుంది. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. అయితే ఇదంతా లెక్కలు వేసేటప్పుడు మాత్రమే బాగుంటుంది. కానీ, నిజ జీవితంలో ఆచరణ సాధ్యం అవుతుందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే, ఇప్పటికే ఉన్న ఆర్థిక బాధ్యతల వల్ల అధిక ఈఎంఐ చెల్లించేందుకు కుదరకపోవచ్చు. కాకపోతే, కొన్ని సర్దుబాట్లు చేసుకోవడం వల్ల దీన్ని సాధ్యం చేయొచ్చు.
2. రుణం వీలైనంత తక్కువగా!
ఇల్లు కొనాలనుకున్నప్పుడు వీలైనంత వరకు మీ చేతి నుంచే చెల్లించేందుకు ప్రయత్నం చేయాలి. దీనివల్ల అధిక రుణం తీసుకునే అవసరం తప్పుతుంది. అందుకే మీకు అవసరమైన మేరకే రుణాన్ని తీసుకోవడం మంచిది. ఒకవైపు 8.5 - 9 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తూ, మీ దగ్గరున్న మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చేదేమి ఉండదు. రుణం తక్కువగా తీసుకోవడం వల్ల ఈఎంఐలు చెల్లించడం తేలిక అవుతుంది. పైకా వడ్డీ మొత్తం కూడా ఆదా అవుతుంది. ఇలా మిగిలిన డబ్బును పెట్టుబడులకు మళ్లించే ప్రయత్నం చేసుకోవచ్చు. లేదంటే ఈఎంఐ అధికంగా చెల్లిస్తూ తొందరగా రుణాన్ని తీర్చేయవచ్చు.