How To Improve Loan Eleigibility :సాధారణంగా లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు మంచి క్రెడిట్ స్కోరు, లోన్ హిస్టరీ చూస్తాయి. అవి సరిగా ఉన్నవారికే లోన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. గృహ, వాహన, పర్సనల్ లోన్లో కొంత వడ్డీ రాయితీనీ కూడా అందిస్తుంటాయి. అయితే కొన్ని అంశాల్లో కఠినంగా వ్యవహరిస్తాయి. అందుకే కొత్త లోన్లను తీసుకోవాలనుకున్నప్పుడు, మన రుణ చరిత్రను ప్రభావితం చేసే అంశాలు, వాటిని ఎలా అధిగమించాలనే విషయాలను పరిశీలిద్దాం.
అప్పటికే లోన్ ఎక్కువ ఉంటే
లోన్ కావాలని మనం దరఖాస్తు చేయగానే, బ్యాంకులు ముందుగా మన ఆర్థిక స్తోమతను పరిశీలిస్తాయి. ఇప్పటికే ఉన్న బాకీల గురించి ఆరా తీస్తాయి. అందులో కొన్నింటిన తీర్చేందుకు అవకాశం ఉందా లేదా అనేది పరిశీలిస్తాయి. దరఖాస్తుదారుడు ఇంతకుముందే రుణం తీసుకుని, అది ఆరు నెలల్లో ముగుస్తుందంటే, బ్యాంకులు దాన్ని పెద్దగా పట్టించుకోవు. కానీ ఇక్కడ, మన ఇన్కంలో ఎంత మొత్తం ఈఎమ్ఐలు చెల్లిస్తున్నారనేది చాలా కీలకం. ఆదాయంలో 40 శాతానికి మించి లోన్ ఈఎమ్ఐలను వాయిదాలకు చెల్లిస్తూ ఉంటే అలాంటి వారికి కొత్త అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు కాస్త ఆలోచిస్తాయి. 60 శాతం దాటితే మాత్రం రుణం ఇవ్వడం కష్టం కావచ్చు. కాబట్టి, గృహ రుణం లాంటి పెద్ద అప్పు కావాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న రుణాలను ఒకేసారి తీర్చేయడమే ఉత్తమం.
క్రెడిట్ స్కోరు ముఖ్యం
ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు తమ క్రెడిట్ స్కోరును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. చాలా సంస్థలు ఇప్పుడు ఈ స్కోరును ఉచితంగానే తీసుకునే సౌలభ్యం కల్పిస్తున్నాయి. 750కి మించి స్కోరున్న వ్యక్తులకు రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు ఇష్టపడతాయి. కొన్ని బ్యాంకులు 700 స్కోరున్నా ఇబ్బంది లేదని చెబుతున్నాయి. క్రెడిట్ స్కోరు దెబ్బతింటే వెంటనే దాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోండి. క్రెడిట్ కార్డును విపరీతంగా వాడటం వల్ల స్కోరు దెబ్బతింటుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు పరిమితి రూ.లక్ష అనుకుందాం. ఇందులో మీ క్రెడిట్ వినియోగం 40 శాతానికి మించకూడదు. అంటే రూ.40వేల వరకే మీరు కార్డును వాడాలి. దీనికి మించి వాడినప్పుడు క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. చాలామంది రుణదాతలు 30శాతం క్రెడిట్ వినియోగాన్ని ఇష్టపడతారు. ఒకే బ్యాంకులో కాకుండా, రెండు మూడు బ్యాంకుల్లో రుణానికి దరఖాస్తు చేసినా స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. తరచూ రుణాల కోసం దరఖాస్తు చేస్తుంటే మీరు రుణాలపైనే ఆధారపడుతున్నారని ఆర్థిక సంస్థలు భావిస్తాయి. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ రుణాలు తీసుకోవడమూ సరికాదు.