How To Get Credit Card Without Job :నేటికాలంలో క్రెడిట్ కార్డు వాడకం చాలా సర్వసాధారణం అయిపోయింది. చాలా మందికి ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ ఒక వరంలా కనిపిస్తుంది. మీకు ఉద్యోగం, ఉపాధి ఉంటే క్రెడిట్ కార్డు పొందడం చాలా సులభం. ఎందుకంటే బ్యాంకులు, కంపెనీలు క్రెడిట్ కార్డులను జారీ చేసే ముందు మీ ఆదాయాన్ని చెక్ చేస్తాయి. దీని కోసం మీరు సాలరీ స్లిప్‌లు, లేదంటే ఐటీఆర్ పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది. అయితే ఉద్యోగం చేయనివారి పరిస్థితి ఏమిటి? వాళ్లు క్రెడిట్ కార్డ్‌ను ఎలా పొందాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఇతర ఆదాయ మార్గాలు చూపించడం :
మీకు ఉద్యోగం లేకపోయినా, ఇతర ఆదాయ మార్గాల్లో వచ్చిన ఆదాయ వివరాలు అందించి క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే డివిడెండ్లు, ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ద్వారా సంపాదించిన ఆదాయ వివరాలు, ఐటీఆర్ పత్రాలు సమర్పించి క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా చూపించాలి. ఇవన్నీ పరిశీలించి, మీకు తిరిగి అప్పు తీర్చే సామర్థ్యం ఉందా? లేదా? అన్నది బ్యాంక్ నిర్ణయిస్తుంది. మీకు అన్ని అర్హతలు ఉంటే, కచ్చితంగా క్రెడిట్ కార్డ్ మంజూరు చేస్తుంది.
2. మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై క్రెడిట్ కార్డు :
మీకు ఉద్యోగం లేకపోయినా క్రెడిట్ కార్డ్ పొందడానికి మరొక ఆప్షన్ ఉంది. బ్యాంకులు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను తనఖాగా ఉంచుకుని సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి. ఈ క్రెడిట్ కార్డ్‌ల పరిమితి మీ ఎఫ్డీలో 80-90 శాతం వరకు ఉంటుంది. మీరు కనుక సకాలంలో బకాయిలు చెల్లించకపోతే, మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి దానిని రికవరీ చేసుకుంటారు.
3. యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ : మీ కుటుంబంలో ఎవరికైనా (ప్రైమరీ) క్రెడిట్ కార్డ్ ఉంటే, దానిపై యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. సాధారణంగా ప్రైమరీ క్రెడిట్ కార్డ్ హోల్డర్ జీవిత భాగస్వామికి, తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, పిల్లలకు (18 ఏళ్లు పైబడినవారికి) యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రైమరీ కార్డ్‌పై ఉన్న క్రెడిట్ పరిమితినే విభజించి, యాడ్-ఆన్ కార్డ్‌లు ఇస్తారు. కనుక ఏ కార్డుతో లావాదేవీలు చేసినా, అవి అన్నీ ప్రైమరీ క్రెడిట్‌కార్డ్ లావాదేవీల్లోనే యాడ్ అవుతాయి. రివార్డ్ పాయింట్స్ కూడా అంతే.