RBI Credit Score Update Rules :వ్యక్తిగత రుణాల మంజూరు ఇకపై అంత సులభం కాదు. ఎందుకంటే వాటికి సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కఠినతరం చేసింది. క్రెడిట్ స్కోరును ఎప్పటికప్పుడు త్వరితగతిన అప్‌డేట్ చేయాల్సిందే అని క్రెడిట్ స్కోర్ బ్యూరోలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ రూపొందించిన కొత్త గైడ్‌లైన్స్ జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటిలోని ముఖ్యమైన అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
కీలక మార్పులు
క్రెడిట్ స్కోరు/క్రెడిట్ రిపోర్ట్ అనేది రుణాలు పొందడంలో మనకు చాలా కీలకమైంది. అయితే క్రెడిట్ రిపోర్టును అప్‌డేట్ చేసేందుకు క్రెడిట్ బ్యూరోలు ఇంతకుముందు గరిష్ఠంగా 30 నుంచి 45 రోజుల సమయాన్ని తీసుకునేవి. ఆ గడువును ఆర్‌బీఐ బాగా తగ్గించింది. గరిష్ఠంగా 15 రోజుల్లోగా క్రెడిట్ రిపోర్టును అప్‌డేట్ చేయాలని నిర్దేశించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ అంశంపై శ్రద్ధపెట్టాల్సి ఉంటుంది. తమ వినియోగదారులకు సంబంధించిన క్రెడిట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రెడిట్ బ్యూరోలకు పంపాల్సి ఉంటుంది. ఆ వెంటనే క్రెడిట్ బ్యూరోలు తమతమ యాప్‌లు, పోర్టల్స్‌లో ఖాతాదారులు/రుణగ్రహీతలు/వినియోగదారుల క్రెడిట్ రిపోర్టులను అప్‌డేట్ చేస్తాయి. దీంతోపాటు ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకటికి మించి వ్యక్తిగత రుణాలను పొందడం అనేది కష్టతరం అయ్యేలా నిబంధనలను ఆర్‌బీఐ మార్చింది.
క్రెడిట్ రిపోర్ట్‌ను ఎందుకు అప్‌డేట్ చేయాలి?
క్రెడిట్ రిపోర్టు అప్‌డేట్ కావడం ఆలస్యమైతే, మంచి ట్రాక్ రికార్డ్ కలిగిన వారికి సకాలంలో రుణాలు దొరకకపోవచ్చు. నెగెటివ్ ట్రాక్ రికార్డ్ కలిగిన వారికి వెంటనే రుణాలు మంజూరై పోవచ్చు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదంటే క్రెడిట్ రిపోర్టు అప్‌డేటెడ్‌గా ఉండటం చాలా కీలకం. రుణాలకు దరఖాస్తు చేసుకునే వారి నేపథ్యంపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక అవగాహనకు వచ్చేందుకు క్రెడిట్ రిపోర్టే ప్రామాణికంగా నిలుస్తుంటుంది.
వ్యక్తిగత రుణాలపై పడే ప్రభావం ఎంత ?
ఒక వ్యక్తి ఒకేసారి ఒకటికి మించి రుణాల కోసం దరఖాస్తు చేయడం కష్టతరం అయ్యేలా ఆర్‌బీఐ నూతన నిబంధనలు ఉన్నాయి. ప్రతీ 15 రోజులకు క్రెడిట్ రిపోర్టు అప్‌డేట్ అయిపోతుంటుంది. దాని ఆధారంగా దరఖాస్తుదారుడి ఆర్థిక పరపతి, రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యంపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అవగాహనకు వస్తాయి. ఒకేసారి ఒకటికి మించిన చోట్లలో రుణాలు మంజూరుకావు.