తెలంగాణ

telangana

బ్యాంక్​ నుంచి భారీ మొత్తం విత్​డ్రా చేయాలా? ఇలా చేస్తే నో ట్యాక్స్​! - Bank Account Tax Rules

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 5:26 PM IST

Bank Account Tax Rules : నేరుగా బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసినా, ఏటీఎం నుంచి డబ్బులు తీసినా, మనం కొన్ని రూల్స్‌ను గుర్తుంచుకోవాలి. క్యాష్ విత్‌డ్రా చేయడానికి ఉన్న పరిమితులను తెలుసుకోవాలి. ఆయా పరిమితులు దాటితే ఛార్జీల బాదుడు తప్పదని గ్రహించాలి.

Cash Deposit Limit in Saving Account as per Income Tax
Income Tax rules in india (Getty Image)

Bank Account Tax Rules : బ్యాంకు లేదా ఏటీఎం నుంచి డబ్బులను విత్‌డ్రా చేస్తున్నప్పుడు మనం ఆచితూచి వ్యవహరించాలి. ఎడాపెడా డబ్బులు విత్‌డ్రా చేస్తే ఛార్జీల బాదుడును భరించేందుకు రెడీ అయిపోవాలి. ఛార్జీలు వద్దులే అనుకుంటే మాత్రం, తప్పకుండా రూల్స్‌ను తెలుసుకోవాలి. డబ్బులను నేరుగా బ్యాంకు నుంచి విత్​డ్రా చేయడానికి, ఏటీఎం నుంచి తీసుకోవడానికి ఎంతమేర పరిమితులు ఉన్నాయనే దానిపై కనీస అవగాహన కలిగి ఉండాలి. ఆ నిబంధనలపై ఓ లుక్కేద్దాం రండి.

వాళ్లపై భారీగా టీడీఎస్ బాదుడు!
నేరుగా బ్యాంకు నుంచి ఎంత డబ్బును విత్‌డ్రా చేసినా ఛార్జీలు పడవని చాలా మంది భావిస్తుంటారు. వాస్తవానికి అలాంటి ఉచిత సర్వీసులేవీ బ్యాంకులు అందించవు. ప్రతి దానికీ ఒక ఛార్జీ లెక్క పక్కాగా ఉంటుంది. నేరుగా బ్యాంకు నుంచి డబ్బులను విత్‌డ్రా చేసే విషయానికొస్తే, రెగ్యులర్‌గా ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) ఫైల్ చేసే వారికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్ ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకు మించి అకౌంటు నుంచి విత్‌డ్రా చేస్తే లావాదేవీలన్నీ టీడీఎస్ (ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) పరిధిలోకి వెళ్తాయి. వరుసగా మూడు సంవత్సరాలు తమ ఐటీఆర్ దాఖలు చేయని వారికే ఈ నియమం వర్తిస్తుంది. ఐటీఆర్‌లు ఫైల్ చేయనివారు బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి రూ.20 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే టీడీఎస్ కట్టాల్సి వస్తుంది. క్రమం తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేసేవారు ఒక ఆర్థిక సంవత్సరం వ్యవధిలో రూ.1కోటి దాకా నగదును విత్‌డ్రా చేసినా టీడీఎస్‌ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఒక ఆర్థిక సంవత్సరం వ్యవధిలో విత్‌డ్రా చేసిన మొత్తం రూ.1కోటి దాటితే 2 శాతం టీడీఎస్ చెల్లిస్తే సరిపోతుంది. గత మూడేళ్లుగా ఐటీఆర్‌లు ఫైల్ చేయనివారు రూ.20 లక్షల కంటే ఎక్కువ అమౌంటును అకౌంటు నుంచి విత్‌డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్ కట్టాలి. రూ.1కోటి కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే 5 శాతం టీడీఎస్‌ను చెల్లించాల్సి ఉంటుంది.

ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు
ఏటీఎం నుంచి చేసే క్యాష్‌ విత్‌డ్రా‌లపైనా ఛార్జీలను విధిస్తారు. ఏటీఎం లావాదేవీలపై 2022 జనవరి 1 నుంచి ఛార్జీలను పెంచారు. పరిమితికి మించిన ప్రతీ లావాదేవీపై గతంలో రూ.20 వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ మొత్తం రూ.21కి పెరిగింది. మనం అకౌంటు కలిగి ఉన్న బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలలో ప్రతినెలా ఐదుసార్లు ఉచితంగా డబ్బులను విత్‌డ్రా చేయొచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి ప్రతినెలా మూడుసార్లు డబ్బులను ఫ్రీగా తీసుకోవచ్చు. అయితే దేశంలోని మెట్రో నగరాల్లో ఉన్న బ్యాంకు సొంత ఏటీఎంల నుంచి నెలకు మూడుసార్లే మనం డబ్బులను ఉచితంగా తీయగలుగుతాం. ఈ రూల్స్‌ను గుర్తుంచుకుంటే మనం చాలా ఛార్జీల బాదుడు నుంచి రక్షణ పొందొచ్చు. ఎంతో డబ్బును ఆదా చేయొచ్చు.

UPI సమస్యలపై ఫిర్యాదు చేయాలా? ఈ సింపుల్​ ప్రాసెస్​ ఫాలో అవ్వండి! - How To File A UPI Complaint

చిరు వ్యాపారులకు ఉపయోగపడే టాప్​-5 టూ-వీలర్స్ ఇవే! - Bike For Business Purpose

ABOUT THE AUTHOR

...view details