Hero MotoCorp Discontinues Three Models Bikes:ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన మూడు మోటార్ సైకిళ్ల ప్రొడక్షన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 200 సీసీ కేటగిరీలో రెండు, కమ్యూటర్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఒక బైక్‌కు గుడ్‌బై చెప్పింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లోనూ ఆయా మోడళ్లను తొలగించింది. ఇంతకీ కంపెనీ తొలగించిన ఆ మూడు మోడల్ బైక్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
కంపెనీ గుడ్‌బై చెప్పిన బైక్ మోడల్స్ ఇవే: హీరో మోటోకార్ప్.. 200సీసీ కేటగిరీలో 'ఎక్స్‌ట్రీమ్ 200S 4v', హీరో 'ఎక్స్‌పల్స్ 200T' మోడళ్లతో పాటు, కమ్యూటర్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ప్యాషన్ ఎక్స్‌టెక్' బైక్ కు కూడా గుడ్‌బై చెప్తూ నిర్ణయం తీసుకుంది. వీటిలో 'ప్యాషన్ ఎక్స్‌టెక్'.. ఒకప్పుడు స్ప్లెండర్‌తో సమానంగా ఆదరణకు నోచుకున్న పాపులర్ బైక్. దీన్ని కూడా కంపెనీ తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కారణం ఇదే!:ఈ బైక్‌ల సేల్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం కారణంగానే ఈ డెషిషన్ తీసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
కాగా హీరో మోటోకార్ప్.. 200సీసీ సెగ్మెంట్‌లో 'ఎక్స్‌పల్స్ 200 4v', 'ఎక్స్‌పల్స్ 200T', 'ఎక్స్‌ట్రీమ్ 200S 4v' బైక్స్‌ను విక్రయిస్తోంది. అయితే ఇందులో 'ఎక్స్‌పల్స్ 200 4v' తప్ప మిగిలిన రెండు మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో ఈ సెగ్మెంట్‌లో ప్రస్తుతం 'ఎక్స్‌పల్స్ 200 4v' మాత్రమే అందుబాటులో ఉంది. కంపెనీ దాన్ని కూడా త్వరలోనే నిలిపివేసే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే దాని ప్లేస్‌లో 210 సీసీలో కొత్త 'ఎక్స్‌పల్స్'తో రీప్లేస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.