Personal Loan With Aadhar Card : ఆర్థిక అవసరాలు ఎప్పుడు, ఏ విధంగా వస్తాయో చెప్పలేం. అలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా డబ్బులు కావాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అందరికీ గుర్తొచ్చేవి వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్స్). వీటికి ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా వేగంగా లోన్ మంజూరు అవుతుంది. అయితే దేశంలో అనేక సేవలను పొందేందుకు ఆధార్ ఒక కీలకమైన డాక్యుమెంట్. అడ్రస్, వ్యక్తిగత గుర్తింపులాంటి అవసరాలకు దీన్ని ఉపయోగిస్తుంటాం. ఆధార్‌తో పర్సనల్ లోన్‌ను పొందొచ్చు. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.
వేగంగా మంజూరు
ఎలాంటి హామీ, తనఖా అక్కర్లేకుండా పలు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) వ్యక్తిగత రుణాలను ఇస్తుంటాయి. అదేవిధంగా ఆధార్ కార్డును చూపించి పర్సనల్ లోన్ పొందొచ్చు. ఎక్కువ డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా సులభంగా పర్సనల్ లోన్ ను తీసుకోవచ్చు. ఆదాయ రుజువు, చిరునామా, వ్యక్తిగత ధ్రువీకరణ వంటివి ప్రత్యేకంగా అవసరం లేకపోవడం వల్ల ఆధార్ ఆధారిత రుణాలు సాధారణ అప్పులతో పోలిస్తే వేగంగా మంజూరు అవుతాయి. ఈ రుణాల కోసం పూర్తిగా డిజిటల్‌లోనే అప్లై చేసుకోవాలి. బ్యాంకుల వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తుల జోక్యం ఉండదు కాబట్టి లోన్ అప్రూవల్ వేగంగా అవుతుంది.
పరిమిత పత్రాలున్నా!
పరిమిత ఆర్థిక పత్రాలు ఉన్నవారూ ఆధార్ ఆధారంగా లోన్ ను పొందొచ్చు. తక్కువ ఆదాయం ఉన్నవారికీ ఈ రుణాలను బ్యాంకులు ఇస్తున్నాయి. 21-58 ఏళ్ల మధ్య ఉన్న వారికి సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పర్సనల్ లోన్స్ ను అందిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో 60-65 ఏళ్ల వారికీ లోన్ ఇస్తుంటాయి.
నెలవారీ ఆదాయం
రుణ గ్రహీతలకు నెలవారీ ఆదాయం రూ.15,000-రూ.25,000 మధ్య ఉండాలని కొన్ని బ్యాంకులు షరతులు పెడుతున్నాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఈ విషయంలో కాస్త వెసులుబాటును కల్పిస్తున్నాయి. క్రెడిట్ స్కోరు కనీసం 700 వరకూ ఉండాలనే నిబంధన కూడా ఉంది. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి వడ్డీ రేటులో రాయితీ ఉంటుంది. ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందుతూ క్రమం తప్పకుండా ఆదాయం ఆర్జించే వారికి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ రుణాన్ని మంజూరు చేస్తాయి.
ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు తమ గుర్తింపు ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు, ఓటర్ ఐడీ, పాన్ కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు ఆఫీసు చిరునామా ధ్రువీకరణ కోసం జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను చూపించాలి. ఆదాయ ధ్రువీకరణ కోసం వ్యాపారులు లాభనష్టాల పట్టిక, బ్యాలెన్స్ షీట్, బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ వివరాలను అందజేయాలి. ఉద్యోగులు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్, సాలరీ స్లిప్పులు, ఫారం-16లాంటివి ఇవ్వాలి. ఆధార్‌కు మొబైల్ నంబరు లింక్ అయ్యి ఉండాలి. అప్పుడే రుణ దరఖాస్తును పూర్తి చేయగలుగుతారు.
పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడం ఎలా?
ముందుగా ఆధార్ తో పర్సనల్ లోన్స్ ఇస్తున్న రుణదాత వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ రుణ అర్హతను చెక్ చేసుకోండి. ఆపై అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయండి. ఆధార్ ఓటీపీ ఆధారంగా మీ కేవైసీని పూర్తి చేయండి. అన్ని పత్రాలనూ సమర్పించిన తర్వాత ఒకటి లేదా రెండ్రోజుల్లో మీ రుణ దరఖాస్తు అప్రూవల్ అయ్యి, డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది.
లోన్ అమౌంట్ ఎంత?
కొన్ని బ్యాంకులు రూ.50,000 నుంచి రూ.5,00,000 వరకూ పర్సనల్ లోన్ ఇస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలు రూ.25,000 నుంచీ రుణాన్ని అందిస్తున్నాయి. సొంత ఖాతాదారులకు బ్యాంకులు కాస్త అధిక మొత్తంలో లోన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
వడ్డీ రేట్లు ముఖ్యమే!
వ్యక్తిగత రుణాలపై వార్షిక వడ్డీ రేటు 12.7 శాతం వరకూ ఉండే అవకాశం ఉంది. పరిశీలనా రుసుము 5శాతం వరకూ ఉండొచ్చు. ఏడాది నుంచి ఐదేళ్ల వరకూ లోన్ వ్యవధిని ఎంచుకోవచ్చు. ఎలాంటి ముందస్తు చెల్లింపుల ఛార్జీలు ఉండవు. వాయిదా చెల్లించకపోతే రూ.500 వరకూ ఫైన్ ఉంటుంది. వీలైనంత వరకూ ఒకటి రెండు బ్యాంకుల రుణాలను పోల్చి చూసుకొని, ఆ తర్వాతే పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిది.