Health Insurance Policy Benefits : ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కుటుంబంలో ఒక్కరు అనారోగ్యం పాలైనా ఆర్థిక లక్ష్యాలన్నీ తారుమారైపోతున్నాయి. ఈ తరుణంలోనే ఆరోగ్య బీమా తప్పనిసరి అవసరంగా మారింది. ఇది వైద్య అవసరాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న వైద్య ఖర్చులు అందరీ ఆందోళనలు కలిగిస్తున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం చూస్తే వైద్య ద్రవ్యోల్బణం ఏటా 20 శాతం వరకూ ఉంటోంది. వైద్య ఖర్చులు కూడా అలానే పెరిగుతున్నాయి. మంచి ఆరోగ్య బీమా పాలసీ ఉన్నప్పుడే ఏదైనా వచ్చినప్పుడు ఆర్థికంగా మనపై ఒత్తిడి ఉండదు.
ఆరోగ్యంగా ఉన్నప్పుడే పాలసీ తీసుకోవాలి
చాలామందికి నేను ఆరోగ్యంగా ఉన్నాను కాదా పాలసీ అవసరమా అని అనుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ పాలసీని కొనుగోలు చేసేందుకు అనువైన సమయం. చిన్న వయసులోనే ఆరోగ్య బీమాలను తీసుకోవడం వల్ల ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పుడు తీసుకోవటం వల్ల సులభంగా పాలసీ లభిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు పాలసీ తీసుకోవాలంటే అధిక ప్రీమియం ఉంటుంది. పైగా ముందస్తు వ్యాధులకు వేచి ఉండే సమయం నిబంధన వర్తిస్తుంది. ఆరోగ్య బీమా పాలసీ అంటే కేవలం వ్యాధులు వచ్చినప్పుడే ఉపయోగపడేది కాదు ప్రమాదాలు జరిగినప్పుడు వర్తిస్తుంది. అనుకోని ప్రమాదం వల్ల ఆసుపత్రిలో చేరినప్పుడూ ఆరోగ్య బీమా చికిత్స ఖర్చులను చెల్లిస్తుంది. ఆరోగ్య బీమ పాలసీ తీసుకోవడాన్ని వాయిదా వేయకుండాఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది.
తక్కువ ప్రీమియం పాలసీలు తీసుకోవాలా
ఆరోగ్య బీమా పాలసీల విషయంలో ప్రీమియం కాస్త అధికంగా ఉండటం చాలామంది వెనకడుగు వేస్తుంటారు. ఏటా ప్రీమియం చెల్లించటం కష్టం అవుతుందని అనుకుంటారు. అయితే తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ ఇచ్చే టర్మ్ పాలసీలను తీసుకోవచ్చు. కానీ, ఆరోగ్య బీమా పాలసీలను విషయంలో కేవలం ప్రీమియం ఒక్కటే ఆలోచించి తీసుకోవడం మంచిదికాదు. ఏ రెండు సంస్థల పాలసీలూ, లేదా ఒక సంస్థ అందించే రెండు పాలసీలూ ఒకే విధంగా రక్షణ కల్పించవు. అందుకే పాలసీల విషయంలో అవసరం ఏమిటి? నిబంధనలు ఎలా ఉన్నాయి? ఆసుపత్రిలో చేరినప్పుడు నగదు రహిత చికిత్స, మినహాయింపులు, ఉప పరిమితులు, అదనపు ప్రయోజనాల్లాంటివి చూసుకొని ఎంచుకోవాలి. కాస్త అధిక ప్రీమియం ఉన్నా కొన్నిసార్లు తప్పదు.