GST Council Meeting 2024 : జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వాయిదా పడింది. నవంబర్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం వెలువడనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో భేటీ అయిన 54వ జీఎస్టీ మండలి, ఈ అంశంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే సమావేశంలో క్యాన్సర్ ఔషధాలపై, నమ్కీన్స్పై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం వెలువడింది. కౌన్సిల్ సమావేశం అనంతరం సమావేశం వివరాలను విలేకరుల సమావేశంలో మంత్రి వెల్లడించారు.
జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ, ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే నిర్ణయం వెలువడుతుందని అందరూ ఆశించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన మండలి, మంత్రుల బృందానికి(GoM) ఆ బాధ్యతను అప్పగించింది. బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి నేతృత్వంలో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందానికే ఈ బాధ్యతనూ కట్టబెట్టంది. కొంతమంది కొత్త సభ్యులు ఈ బృందంలో చేరతారని, అక్టోబర్ చివరి నాటికి నివేదిక సమర్పిస్తారని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనిపై నవంబర్‌లో జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.