Fixed Deposit For Child In India :పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ ఉన్న పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ముందుంటాయి. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు. దీని వల్ల వారికి మున్ముందు అవసరమైన డబ్బును కూడబెట్టుకునేందుకు వీలు ఉంటుంది.
దీర్ఘకాలం పాటు సురక్షితమైన పథకాల్లో మదుపు చేయాలనుకున్నప్పుడు ఎఫ్డీలు అనుకూలంగా ఉంటాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా ఎఫ్డీలు ప్రారంభిస్తే, భవిష్యత్లో మంచి (కార్పస్) నిధిని జమ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అది వారి చదువులు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది. దాదాపు ప్రతి బ్యాంకూ పిల్లల కోసం ఎఫ్డీలను ప్రత్యేకంగా అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఆన్లైన్లోనే ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఎఫ్డీ చేసేందుకు మీ పిల్లల పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల పాన్, చిరునామా వివరాల్లాంటివి బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది.
ఎఫ్డీ ఎప్పుడు ప్రారంభించాలి?
పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం మంచిది. ఇలా చేస్తే దీర్ఘకాలంలో మీ డబ్బులు కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల బాగా పెరుగుతాయి. అయితే మీరు చేసే డిపాజిట్లను క్రమం తప్పకుండా సమీక్షించాలి. వడ్డీ రేటు పెరిగినప్పుడు పాత డిపాజిట్లను రద్దు చేసి, ఎక్కువ వడ్డీ రేటును ఇస్తున్న ఎఫ్డీలో పొదుపు చేయాలి. దీని వల్ల అదనపు వడ్డీ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీకి ట్యాక్స్ వర్తిస్తుందని గుర్తించుకోవాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, తగిన ప్రణాళికలు వేసుకోవాలి.