తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్రంప్ విజయం తర్వాత - రూ.25లక్షల కోట్లు దాటిన ఎలాన్​ మస్క్ సంపద - ఎలా అంటే? - ELON MUSK NET WORTH

డొనాల్డ్ ట్రంప్ విక్టరీ ఎఫెక్ట్​ - 300 బిలియన్‌ డాలర్లు దాటిన ఎలాన్‌ మస్క్‌ సంపద!

Elon Musk
Elon Musk (AP)

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 3:26 PM IST

Elon Musk Net Worth : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌నకు మద్దతు ఇచ్చిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంపద ఆమాంతం పెరిగింది. భారత కరెన్సీలో 25 లక్షల కోట్ల రూపాయలు దాటింది. 300 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన ఏకైక కుబేరుడిగా మస్క్‌ నిలిచారు. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెన్స్‌, ఫోర్బ్స్‌ రియల్‌టైమ్​ బిలియనీర్స్‌ లిస్ట్‌ వెల్లడించాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయానికి ఎలాన్‌ మస్క్‌ ఎంతో కృషి చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మస్క్‌ సంపద భారీగా పెరిగింది. 300 బిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.25 లక్షల కోట్లు దాటేసినట్లు బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ పేర్కొంది. మస్క్‌ సంపద ఈ మార్క్‌కు చేరుకోవడం మూడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. మస్క్‌కు చెందిన టెస్లా షేర్లు గత 5 రోజుల్లోనే ఏకంగా 30 శాతం వరకు పెరిగాయి. మస్క్‌ సంపద 50 బిలియన్‌ డాలర్లు పెరిగి 313.7 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రాక ముందు మస్క్‌ సంపద 250 బిలియన్‌ డాలర్లుగా ఉండేదని ఇప్పుడు అది 304 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్‌ రియల్‌టైమ్​ బిలియనీర్స్‌ లిస్ట్‌ పేర్కొంది.

బ్లూమ్‌బర్గ్‌ ప్రకారం, 2022 జనవరిలో 340.4 బిలియన్ డాలర్లతో 300 బిలియన్‌ డాలర్లకు పైగా సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా మస్క్‌ నిలిచారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిని చేరుకున్నారు. అమెజాన్‌ వ్యవస్థాపకులు జెఫ్​ బెజోస్‌ 230 బిలియన్‌ డాలర్లతో, మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ 209 బిలియన్‌ డాలర్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతు ఇచ్చిన మస్క్‌ ఆయనకు పెద్ద మొత్తంలో విరాళాలు సైతం ఇచ్చారు. ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించిన నేపథ్యంలో ఎలాన్‌ మస్క్‌కు ఆయన కార్యవర్గంలో కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని గతంలో ట్రంప్‌ సైతం పేర్కొన్నారు. ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థకు కూడా ట్రంప్‌ మద్దతు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details