తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టార్టప్​ మొదలుపెట్టాలా? ఎలాన్​ మస్క్​ చెప్పిన ఈ 15 టిప్స్ పాటిస్తే - సక్సెస్​ గ్యారెంటీ! - ELON MUSK TIPS FOR ENTREPRENEURS

ఎలాన్ మస్క్ చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే - వ్యాపారంలో విజయం సాధించడం పక్కా!

Elon Musk
Elon Musk (AP)

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 10:47 PM IST

Elon Musk Tips For Entrepreneurs :ఎలాన్ మస్క్ - పరిచయం అక్కరలేని పేరు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా, రాకెట్​ కంపెనీ స్పేస్ఎక్స్​, సోలార్​ ప్యానెల్ డిజైన్ కంపెనీ సోలార్ సిటీలను స్థాపించి, దిగ్విజయంగా వాటిని నడిపిస్తున్నారు. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్​ను కొని, దానిని X.comగా మార్చారు. ఇప్పుడు దానిని ఆల్​-ఇన్-వన్​ యాప్​గా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే నాన్​-ప్రాఫిట్ రీసెర్చ్​ కంపెనీ 'ఓపెన్​ ఏఐ'కు సహ వ్యవస్థాపకుడిగా ఎలాన్​ మస్క్ ఉన్నారు. ఇలా తన ఆలోచనలతో వ్యాపార సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసుకుంటూ, ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానానికి చేరుకున్నారు.

మరి మీరు కూడా ఎలాన్​ మస్క్​లాగా మంచి వ్యాపారవేత్త కావాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఔత్సాహిక యువ వ్యాపారవేత్తల కోసం ఎలాన్​ మస్క్ చెప్పిన​ 15 అద్భుతమైన టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

1. ఫీడ్​బ్యాక్ తీసుకోండి :ఏ వ్యాపారం ప్రారంభించాలన్నా ముందుగా యూజర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. అప్పుడే మీ బిజినెస్​లోని లోటు, పాట్లు తెలుస్తాయి. మీ వ్యాపారం విజయవంతం అవ్వాలంటే, కచ్చితంగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉపయోగించాలి. వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలు తెలుసుకోవాలి. సద్విమర్శలను మనస్ఫూర్తిగా స్వీకరించాలి. ఎక్కడ తప్పు జరుగుతోందో తెలుసుకుని, దానిని సరిదిద్దుకోవాలి.

2. విమర్శలను స్వీకరించండి :ఎవరైనా మనం చేసే పనిని విమర్శిస్తే చాలా బాధ కలగడం సహజమే. అయినప్పటికీ సద్విమర్శలను కచ్చితంగా స్వీకరించాలి. ఇది ఒక లెర్నింగ్ ప్రాసెస్ అని మీరు గుర్తుంచుకోవాలి. అప్పుడే మీరు వ్యాపారంలో సక్సెస్ కాగలుగుతారు. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ఎలాంటి విమర్శలనైనా మీరు వ్యక్తిగతంగా తీసుకోకూడదు. కేవలం వ్యాపారాభివృద్ధి కోణం నుంచి మాత్రమే వాటిని చూడాలి. నిజానికి మనం ఎంత పకడ్బందీగా వ్యాపార ప్రణాళికలు (బిజినెస్ ప్లాన్) తయారు చేసినా, వాటిలోని తప్పు, ఒప్పులను మనం స్వయంగా తెలుసుకోలేం. అందుకే ఎదుటివారి మాటలు, విమర్శలు వినాలి. అప్పుడే మన ప్లాన్​లోని లోటుపాట్లను సరిదిద్దుకోగలుగుతాం.

3. ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉండాలి : కొత్తగా వ్యాపారం (స్టార్టప్​) ప్రారంభించేవారు అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీరు కంపెనీని ప్రారంభించి, వర్కర్స్​ చేస్తున్న పనులను చూస్తూ కూర్చుంటే సరిపోదు. వీలైనంత వరకు అన్ని పనులను దగ్గరుండి చూసుకోవాలి. అవసరమైతే మీరే స్వయంగా అన్ని పనులు చేసుకోవాలి. దీనిని ఇంకా వివరంగా చెప్పాలంటే, మీరు స్వయంగా కంపెనీని స్థాపించి, సీఈఓగా పని చేస్తున్నప్పటికీ, అవసరమైతే కంపెనీ ఫ్లోర్ మీరే తుడవాలి. అవసరమైతే ఉద్యోగులకు మీరే టీ అందించాలి. ఫోన్​ కాల్స్​కు సమాధానం కూడా ఇవ్వాలి. అప్పుడే మీరు సక్సెస్ కాగలుగుతారు.

4. ఓపీనియన్స్ తెలుసుకోండి : కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి మీ బిజినెస్ గురించి కచ్చితంగా అన్ని వివరాలు తెలియజేయాలి. కంపెనీ పని విధానానికి (వర్క్ కల్చర్​) అనుకూలంగా వారు పనిచేసేలా చూడాలి. ఉద్యోగుల అభిప్రాయాలు కూడా కచ్చితంగా తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఉద్యోగులు మిస్​లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా కంపెనీ పని విధానానికి భిన్నంగా నడుచుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటప్పుడు వారితో స్వయంగా మాట్లాడాలి. తమ తీరు మార్చుకోమని సౌమ్యంగా చెప్పాలి. ఒకవేళ వారు వినికపోతే, ఎలాంటి మొహమాటం లేకుండా వారిని పని నుంచి తప్పించాలి. ఈ విషయంలో ఎలాంటి మొహమాటానికి తావులేదు.

5. కంపెనీకి ఉపయోగపడేవారిని మాత్రమే చేర్చుకోవాలి : మీ బిజినెస్​ సక్సెస్ కావాలంటే, అందుకు తగ్గ సమర్థులైన ఉద్యోగులను మాత్రమే ఎంచుకోవాలి. వారికి మీ లక్ష్యం గురించి చాలా స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే, వ్యాపార, వ్యవహారాలు విజయవంతం కావాలంటే కచ్చితంగా టీమ్​ వర్క్ బాగుండాలి. అందరూ ఒకేతాటిపై కలిసిమెలసి పనిచేసేలా చూడాలి. ఇదంతా జరగాలంటే, కంపెనీ లక్ష్యాల కోసం కష్టపడి పనిచేసే వాళ్లను మాత్రమే తీసుకోవాలి. కేవలం జీతం కోసం మాత్రమే పనిచేసే వాళ్లను వీలైనంత వరకు వదిలించుకోవాలి.

6. కఠినమైన ప్రశ్నలు వేయాలి : ఉద్యోగులను చేర్చుకునే ముందు కచ్చితంగా చాలా కఠినమైన, లోతైన ప్రశ్నలు వేయాలి. అప్పుడే సదరు వ్యక్తి, తనకు అప్పగించిన పనిని సక్రమంగా చేయగలడో, లేదో తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇందుకోసం కొన్ని ప్రశ్నలు వేయాలి.

  • "మీ జీవితం గురించి వివరంగా చెప్పండి?
  • మీ జీవితంలో తీసుకున్న కీలకమైన నిర్ణయాలు, సాధించిన విజయాలు ఏమిటి?
  • మీరు ఇంతకు ముందు చేసిన ఉద్యోగం గురించి వివరంగా చెప్పండి?
  • మీరు సాల్వ్ చేసిన ప్రొబ్లమ్ గురించి కాస్త వివరంగా చెప్పండి?"

ఇలాంటి ప్రశ్నలు వేయడం వల్ల అభ్యర్థుల శక్తి, సామర్థ్యాలు మనకు తెలుస్తాయి. అంతేకాదు వాళ్లు నిజం చెబుతున్నారా? అబద్ధం చెబుతున్నారా? అనేది తెలుస్తుంది. ఎవరైతే నిజంగా సమస్యను పరిష్కరిస్తారో, వారికి అన్ని విషయాలు కచ్చితంగా తెలుస్తాయి. కనుక మీరు ఎంత సూక్ష్మమైన వివరాలు అడిగినా వారు కచ్చితంగా సమాధానం చెప్పగలుగుతారు. అబద్ధాలు చెప్పేవారు ఈ విషయంలో ఇట్టే దొరికిపోతారు" అని ఎలాన్ మస్క్ అంటారు.

7. విమర్శకుల నోళ్లు మూయించండి :ఎవరైనా కొత్త ఆలోచన చేస్తున్నప్పుడు, చుట్టూ ఉండేవాళ్లు, విమర్శకులు అది సాధ్యం కాదంటూ నిరుత్సాహపరుస్తుంటారు. మరికొందరైతే నేరుగా గేలి చేస్తారు. కానీ మీరు దానిని పట్టించుకోకూడదు. మీరు అనుకున్నది సాధించి వాళ్ల నోళ్లు మూయించాలి. అప్పుడే మీరు వ్యాపారంలో విజయం సాధించగలుగుతారు.

స్పేక్స్ ఎక్స్ రాకెట్ ప్రయోగాల్లో ఎలాన్ మస్క్​ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. చాలా ప్రయోగాలు విఫలం అయ్యాయి. ఆయన కంపెనీ కూడా భారీ నష్టాలను చవిచూసింది. అయినప్పటికీ ఆయన వెనక్కు తగ్గలేదు. పట్టుదలతో కృషి చేసి, అద్భుత విజయాలు సాధించారు. ఇప్పుడు స్పేస్ ఎక్స్​ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగశాలగా మారిపోయింది.

8. లక్ష్యం స్పష్టంగా ఉండాలి :స్టార్టప్ ప్రారంభించాలని అనుకునేవారు కచ్చితంగా ఓ స్పష్టమైన లక్ష్యం కలిగి ఉండాలి. దానిని సాధించడానికి ఎంతైనా కృషి చేయాలి. అప్పుడే విజయం సాధ్యం అవుతుంది.

ఎలాన్​ మస్క్ ఈ భూమి ఎంతో సుసంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో మార్స్​ మీద మానవుల కోసం కాలనీ కట్టాలని సంకల్పించారు. ఇందుకోసం స్పేస్​క్రాఫ్ట్​లను నిర్మిస్తున్నారు. చాలా మందికి ఇది పిచ్చితనంగా అనిపించినప్పటికీ, ఆయన మాత్రం తన లక్ష్యం దిశగా అడుగువేస్తున్నారు.

9. ప్రాసెస్​ను నమ్మవద్దు : మీ కంపెనీలో ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఎవరైనా 'అదంతా ప్రాసెస్​లో భాగమే' అని అంటే, దానిని ఒక 'బ్యాడ్​ సైన్​'లా చూడాలని మస్క్ చెబుతుంటారు. ఎందుకంటే, మీ విజన్​కు తగ్గట్టుగా ఉద్యోగులు పనిచేయాలి. ఒక వేళ అలా చేయడం లేదంటే ఏదో తప్పు జరుగుతున్నట్లు లెక్క. దీనిని మరింత సింపుల్​గా చెప్పాలంటే, చాలా కంపెనీల్లో ఉద్యోగులు ఉంటారు. వారికి కంపెనీ లక్ష్యం గురించి తెలియదు. వాళ్లు ఎలాంటి తెలివి, సృజనాత్మక ప్రదర్శించకుండా పనిచేస్తూ పోతుంటారు. దీని వల్ల కంపెనీకి ఉపయోగం లేకపోగా, తిరిగి నష్టపోయే ప్రమాదం ఉంటుందని ఎలాన్ మస్క్ చెబుతుంటారు.

10. డబ్బు కోసం మాత్రమే పనిచేయొద్దు : ఎవరైనా లాభం కోసమే వ్యాపారం చేస్తారు. కానీ సంపాదనే ధ్యేయంగా పనిచేయకూడదని ఎలాన్ మస్క్ చెబుతారు. ఉదాహరణకు నేడు ప్రపంచమంతా వాయుకాలుష్యంతో ఇబ్బంది పడుతూ ఉంది. దీనికి పెట్రోల్, డీజిల్ వాహనాలే కారణం. అందుకే కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయాలని ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నారు. అంటే ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా ఆయన పయనిస్తున్నారు. ఈ ప్రాసెస్​లో ఆయన వ్యాపారం వృద్ధిలోకి వచ్చింది. భారీగా డబ్బులు కూడా వస్తున్నాయి.

"వ్యాపారం మొదలు పెట్టేవాళ్లు కచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలి. అప్పుడే మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఒకవేళ మీరు సమస్యలకు పరిష్కారం కనుగొనలేకపోతే కచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు" అని ఎలాన్​ మస్క్ స్పష్టం చేశారు.

11. మనస్సు పెట్టి పనిచేయండి : మీరు వ్యాపారం ప్రారంభించినా, లేదా ఒక ఉద్యోగంలో చేరినా, లేదా ఏ పని చేసినా, మనస్ఫూర్తిగా ఇష్టపడి (Passionate) పనిచేయాలి. అప్పుడే విజయం సాధించగలరు.

'నా దగ్గర ఇప్పటికే చాలా డబ్బు ఉంది. వాటితో నేను ఏమైనా కొనగలను. ఒకవేళ రేపు నాకు చాలా డబ్బులు వస్తాయని అనుకుందాం. దాని వల్ల అదనంగా నా జీవితంలో ఎలాంటి మార్పు రాదు. కానీ ఒకవేళ నా పనిమీద నాకు ధ్యాస తగ్గితే, తరువాత ఇంతే విజయవంతంగా నేను వ్యాపారం చేయలేకపోవచ్చు' అని ఎలాన్​ మస్క్ ఓ సందర్భంలో అన్నారు.

12. వీలైనంత త్వరగా వ్యాపారం ప్రారంభించండి : వీలైనంత చిన్న వయస్సులోనే మీ కలల వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది. ఎందుకంటే చిన్న వయస్సులో మీపై పెద్దగా కుటుంబ భారం ఉండదు. కనుక వీలైనంత ఎక్కువ రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక వేళ మీ తొలి ప్రయత్నం విఫలమైనా, తేరుకోవడానికి వీలుంటుంది. మరో వ్యాపారం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాకాకుండా మీపై చాలా బాధ్యతలు ఉంటే, రిస్క్ తీసుకునే పరిస్థితి ఉండదు. పైగా వ్యాపారం విజయవంతం కావడానికి చాలా సమయం పడుతుంది. చిన్న వయస్సులో వ్యాపారంలోకి వచ్చినవారు చాలా కాలంపాటు వేచి ఉండగలుగుతారు. అదే పెద్దవారు అయితే ఈ అవకాశం తగ్గుతుంది.

13. మీరు ఏది రైట్ అనుకుంటే అదే చేయండి : వ్యాపారం ప్రారంభించడం అనేది అంత తేలికైన పనికాదు. దీనికి ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఎదురవుతాయి. ఒక వ్యాపారం విజయవంతం కావాలంటే ఎంత కృషి, పట్టుదల అవసరమో బయట ఉన్నవాళ్లకు తెలియదు. కనుక వాళ్లు తమకు తెలిసినా, తెలియకపోయినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కనుక వారి మాటలు వినాల్సిన అవసరం లేదు. మీకు ఏది సరైనది అనిపిస్తుందో, అదే చేయండి. (మీరు ఎంచుకున్న రంగంలో విశేష అనుభవం ఉన్న, నిపుణుల సలహాలు తీసుకోవడం మాత్రం మరిచిపోవద్దు.)

14. వాస్తవికంగా ఉండండి : చాలా మంది సినిమాల్లో చూపించినట్లు రంగుల కలల్లో విహరిస్తూ ఉంటారు. వ్యాపారాన్ని అద్భుతంగా విస్తరిస్తుందని, భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని భ్రమిస్తూ ఉంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. మీడియా కేవలం విజయవంతమైన వ్యాపారవేత్తలు గురించి మాత్రమే చెబుతుంది. వాస్తవానికి ఇలా సక్సెస్ అయినవారు చాలా తక్కువ మంది ఉంటారు. వ్యాపారంలో ఫెయిల్​ అయినవారు మాత్రం లెక్కలేనంత మంది ఉంటారు. కనుక కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు వాస్తవంలో బతకాలి. కలలు కనడం మంచిదే. కానీ అందుకు తగ్గట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే విజయం సాధ్యం అవుతుంది.

15. మీ బ్రాండ్​ను ఏర్పరుచుకోండి : మీరు ఎంచుకున్న రంగంలో ఇప్పటికే చాలా పెద్ద కంపెనీలు, వ్యాపార దిగ్గజాలు ఉంటారు. వారకంటూ ఒక ప్రత్యేకమైన యూజర్ బేస్ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ కంటూ ఒక గుర్తింపు రావాలంటే, కచ్చితంగా వారందరికంటే మీరు చాలా మంచి వస్తు, సేవలను అందించగలగాలి. నమ్మకమైన సేవలను అందించాలి. మీకంటూ ఒక బ్రాండ్​ను క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మీరు వ్యాపారంలో సూపర్ సక్సెస్ కాగలుగుతారు. ఆల్​ ది బెస్ట్​!

నోట్​ : ఈ ఆర్టికల్​లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేముందు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details