Electric Vehicle Policy Of India : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీని ప్రోత్సహించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఇ-వెహికల్ పాలసీని (E-Vehicle Policy) ఆమోదించినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనివల్ల ఇండియా విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీకి గమ్యస్థానంగా మారుతుందని పేర్కొంది. అంతేకాదు దీని వల్ల ప్రముఖ అంతర్జాతీయ ఈవీ కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేసింది.
India EV Policy Minimum Investment :
కేంద్ర ప్రభుత్వ తీసుకువచ్చిన ఈ కొత్త ఈవీ పాలసీ ప్రకారం, ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ కనీసం రూ.4,150 కోట్లను (5 వేల మిలియన్ డాలర్లు) ఇండియాలో పెట్టుబడి పెడితే, పలు రాయితీలు కల్పిస్తారు. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్త తరహా సాంకేతికత అందుబాటులోకి వస్తుందని, తద్వారా మేకిన్ ఇండియాకు మంచి ఊతం లభిస్తుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. పైగా ఈ న్యూ ఈవీ పాలసీ వల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుందని తెలిపింది. విద్యుత్ వాహనాల వల్ల క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గుతాయని, తద్వారా వాణిజ్య లోటు కూడా భారీగా తగ్గుతుందని స్పష్టం చేసింది.
టెస్లా ఎంట్రీకి ఓకే!
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ఇండియాలోకి ప్రవేశించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీకి ఆమోదం తెలపడం వల్ల, ఇండియాలోకి ప్రవేశించడానికి టెస్లా కంపెనీకి మార్గం సుగమమైంది.