Suriya Gautam Menon Movie : కోలీవుడ్ స్టార్ హీరో గౌతమ్ మేనన్ తెరకెక్కించిన 'ధృవ నక్షత్రం' మూవీ రిలీజ్‌పై ఇంకా సందిగ్ధత నెలకొంది. ఎన్నో ఏళ్ల క్రితమే రూపొందిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మేనన్ సినిమా విశేషాలు పంచుకున్నారు. దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానని అన్నారు. విక్రమ్ కంటే ముందు వేరే హీరోలకు ఈ కథ చెప్పానని తెలిపారు.
"ధృవ నక్షత్రం స్టోరీని నేను ఫస్ట్ వేరే హీరోలకు చెప్పాను. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వారందరూ దాన్ని రిజెక్ట్ చేశారు. నేను కూడా వారి అభిప్రాయాలను అర్థం చేసుకున్నా. అందుకే వాళ్లు రిజెక్ట్ చేసినందుకు నేనేమీ అంతగా బాధపడలేదు. కానీ ఈ స్టోరీకి సూర్య నో చెప్పడాన్ని నేను తట్టుకోలేకపోయాను. అది నన్ను ఎంతగానో బాధించింది. ఈ సినిమా రిలీజ్ కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా. కచ్చితంగా దాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తాను. ఎన్నో ఏళ్ల క్రితం రెడీ అయినా సినిమా అది, కానీ ఆడియెన్స్ ఏమాత్రం బోర్ ఫీల్ కారు. పాత కథ అని అనుకోరు. ఇప్పటివారికి ఇది తప్పకుండా నచ్చుతుందని నేను నమ్ముతున్నా. రీసెంట్గా 'మద గజ రాజ' విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. సుమారు 12 ఏళ్ల క్రితం తెరకెక్కించిన చిత్రం అది. అయితే ఇప్పుడు రిలీజై సక్సెస్ అందుకోవడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఆ సినిమాలాగే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను" అని గౌతమ్ మేనన్ చెప్పారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన 'ధృవ నక్షత్రం' సుమారు ఏడేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఇంకా విడుదల కాలేదు. దీనిపై ఇప్పటికే పలుమార్లు గౌతమ్ మేనన్ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఈ సినిమా పోస్ట్‌పోన్ అవ్వడం తనకు బాధను మిగుల్చుతుందని అన్నారు .
'ధృవ నక్షత్రం' పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ - 'ఎటైనా వెళ్లిపోవాలనుంది'