Man Kills Brother by Electrocution in In Medak : మహిళ విషయంలో ఏర్పడిన వివాదంతో తమ్ముడు అన్నను కిరాతకంగా చంపాడు. తోడబుట్టిన వాడని, కుటుంబ విలువలు మరచి మహిళ కోసం హతమార్చాడు. నిద్రలో ఉన్న అన్నకు తీగలు చుట్టి విద్యుత్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీసిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
మహిళతో తమ్ముడు చనువుగా ఉంటున్నాడని : తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిక్య తండా గ్రామ పంచాయతీ నాను తండాకు చెందిన తేజవత్ చందర్-మారోనిలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తేజావత్ శంకర్ కూలీ పనులు చేస్తుండగా, చిన్న కుమారుడు గోపాల్ గంజాయి తీసుకుంటూ జులాయిగా తిరుగుతున్నాడు. శంకర్ భార్య నాలుగు సంవత్సరాల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో శంకర్ కూలీ పని చేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళతోనే తమ్ముడు కూడా చనువుగా ఉండటం చూసిన అన్న అతనితో గొడవకు దిగాడు. ఇలా కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి.
తల్లిదండ్రులను కొడుతున్నాడని అన్నను చంపిన తమ్ముడు.. మృతదేహాన్ని 8 ముక్కలు చేసి..
జైలుకు వెళ్లొచ్చినా మరవకుండా : ఇటీవల దొంగతనం కేసులో గోపాల్ జైలుకు వెళ్లి నెలన్నర క్రితం విడుదలయ్యాడు. మహిళ విషయంలో అన్న శంకర్‌తో అయిన గొడవలను మనుసులో పెట్టుకుని శుక్రవారం అర్ధరాత్రి 12.30 సమయంలో తమ్ముడు గోపాల్ లేచి, మద్యం మత్తులో నిద్రిస్తున్న శంకర్ కుడి చేతి చూపుడు వేలికి, ఎడమ కాలు బొటన వేలికి రెండు విద్యుత్ తీగలను కట్టాడు. ఇంకో పక్క వైర్లను స్విచ్ బోర్డులో పెట్టి స్విచ్ వేయడంతో షాక్ తగిలిన శంకర్ గట్టిగా అరిచాడు. ముందు గదిలో నిద్రపోతున్న తండ్రి నిద్రలేచి తలుపు తీయగా, గోపాల్ అతన్ని నెట్టి వేసి పారిపోయాడు. వచ్చి చూసేసరికి పెద్ద కుమారుడు శంకర్ చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు.