Children Hair Fall Reason: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలిపోవడం. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. చాలా మంది యువతీయువకులు వెంట్రుకలు చిన్న వయసులోనే రాలిపోతున్నాయి. కొందరిలోనైతే ఎనిమిదేళ్లకే జుట్టు రాలిపోతుండడం వల్ల ఆందోళన చెందుతుంటారు. అయితే, దీనికి కంగారు పడాల్సిన పనేమీలేదని.. జుట్టు ఊడినా తిరిగి వస్తుందని ప్రముఖ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శైలజ సూరపనేని చెబుతున్నారు. మచ్చలు లేనంతవరకూ భయపడాల్సిన పనిలేదని అంటున్నారు. గట్టిగా జుట్టు లాగికట్టడం, వెంట్రుకలతో ఆడటం వల్ల ఊడుతుందని.. వంశపారంపర్యంగానూ ఈ సమస్య వస్తుందని తెలిపారు. ఇంకా ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు కూడా ఈ సమస్యకు కారణమై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
"ఇంకా కొందరిలో పొలుసుల్లా ఉండి, దురద, దద్దుర్లూ కనిపిస్తాయి. ప్యాచ్‌లుగా జుట్టు రాలిపోతుంటాయి. దీనిని అలోపేషియా ఏరియేటా అంటాం. ఈ సమస్య ఉన్నా చాలా సందర్భాల్లో వెంట్రుకలు తిరిగి పెరుగుతాయి. కొద్ది మందిలో మాత్రం పెరగవు. ఇక, కొన్నిసార్లు పిల్లలే వెంట్రుకలు లాగడం, పీకడం లాంటివి చేస్తుంటారు. ముఖ్యంగా ఇది అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి వారికి మాత్రం నిపుణులతో కౌన్సెలింగ్ చేయించాలి. మానసికంగానూ వారికి మద్దతు తెలిపాలి. టైఫాయిడ్, మలేరియా వంటివి వచ్చినా వెంట్రుకలు రాలతాయి. ఒకవేళ ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు అయితే మాత్రం ట్రీట్‌మెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి."
--డాక్టర్ శైలజ సూరపనేని, కాస్మెటాలజిస్ట్
వీటితో పాటు అలాగే ఐరన్, బయోటిన్ వంటి పోషకాలు శరీరానికి అందుతున్నాయా అనేది చూసుకోవాలని డాక్టర్ శైలజ సూరపనేని చెబుతున్నారు. ఇంకా ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో గుడ్డు, సోయా, పనీర్, ఆకుకూరలు, చేప, నట్స్ వంటివి ఉండేలా చూడాలని సలహా ఇస్తున్నారు. ఫలితంగా శరీరానికి కావాల్సిన పోషకాలూ అందుతాయని అంటున్నారు. ఇంకా జుట్టుకు మైల్డ్ షాంపూలనే వాడాలని చెబుతున్నారు. వివిధ రకాల హెయిర్ స్టైల్స్, గట్టిగా లాగి దువ్వడం, వదులవుతుందని బిగుతుగా జడవేయకూడదని వివరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కురులు ఆరోగ్యంగా పెరుగుతాయని వెల్లడిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ జుట్టు తత్వాన్ని బట్టే తలస్నానం చేయాలట- ఆ షాంపూలు వాడొద్దని నిపుణుల సలహా!
మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? రోజూ ఇలా చేస్తే బ్యూటిఫుల్‌గా కనిపిస్తారట!