Credit Cards Seasonal Rewards : క్రెడిట్ కార్డును తీసుకోవడం గొప్పేం కాదు. దాన్ని తెలివిగా వాడుకొని, అవసరాలను తీర్చుకోవడమే గొప్ప విషయం. హాలిడేస్‌లో, సేల్స్ ఈవెంట్స్‌లో వ్యూహాత్మకంగా క్రెడిట్ కార్డును వినియోగిస్తే కొన్ని సీజనల్ రివార్డులు, క్యాష్ బ్యాక్‌లు, లాయల్టీ పాయింట్స్ లభిస్తాయి. వాటిని రిడీమ్ చేసుకొని బాగానే ఆర్థిక ప్రయోజనం పొందొచ్చు. సీజనల్ సేల్స్ జరుగుతున్న సమయాల్లో క్రెడిట్ కార్డ్ ద్వారా ఎలా ప్రయోజనం పొందాలో తెలియాలంటే ఈ కథనం చదవండి.
మీ క్రెడిట్ కార్డు రివార్డ్ ప్రోగ్రాం గురించి తెలుసుకోండి
క్రెడిట్ కార్డు ఉంటే కస్టమర్ కేర్‌కు కాల్ చేసి, మీ కోసం అందుబాటులో ఉన్న రివార్డ్ ప్రోగ్రాం గురించి వివరంగా తెలుసుకోండి. మీకొచ్చే సందేహాలన్నీ వారిని అడగండి. కొన్ని కార్డులు సీజనల్ కొనుగోళ్లపై బాగానే రివార్డులను అందిస్తాయి. ఇంకొన్ని కార్డులు వినోదం, డైనింగ్, గ్రోసరీ,ట్రావెల్ వంటి నిర్దిష్ట కేటగిరీల్లో షాపింగ్ చేస్తేనే రివార్డులను ఇస్తాయి. పలు క్రెడిట్ కార్డులు సీజనల్ సేల్స్ జరుగుతున్న సమయాల్లో అదనపు రివార్డులను అందించే ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇలాంటి వాటిని క్రెడిట్ కార్డుల వినియోగదారులు అందిపుచ్చుకోవచ్చు.
సీజనల్ ప్రమోషన్లు, ఆఫర్లు
మన దేశంలోని క్రెడిట్ కార్డుల కంపెనీలు ఏటా పండుగల టైంలో సీజనల్ రాయితీలను, రివార్డులను ప్రకటిస్తుంటాయి. దీపావళి, నూతన సంవత్సరం, దసరా, క్రిస్మస్ వంటి సందర్భాల్లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఇ-కామర్స్ వేదికలు సీజనల్ సేల్స్‌ను జరుపుతుంటాయి. వీటి ద్వారా కొనుగోళ్లు జరిపితే రాయితీలు, రిబేట్‌లు, బోనస్ పాయింట్ల రూపంలో అదనపు రివార్డులను అందుకోవచ్చు.
రివార్డులు వచ్చే కేటగిరీల్లోనే ఖర్చు
సీజనల్ సేల్స్ జరుగుతున్న సమయాల్లో కొన్ని క్రెడిట్ కార్డులు గ్రోసరీ, వినోదం, డైనింగ్, ట్రావెల్ వంటి విభాగాల్లోనే రివార్డు పాయింట్లను అందిస్తాయి. అలాంటప్పుడు క్రెడిట్ కార్డుతో ఆయా విభాగాల్లోనే సాధ్యమైనంత ఎక్కువగా కొనుగోళ్లు చేయాలి. దీంతో ఎక్కువగా రాయితీలు లభిస్తాయి. రివార్డులు దక్కుతాయి.
క్రెడిట్ కార్డు పార్ట్‌నర్ బ్రాండ్లలో ఆఫర్లు
కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు పలు కంపెనీలు, బ్రాండెడ్ సంస్థలతో కలిసి పనిచేస్తుంటాయి. సీజనల్ సేల్స్ జరిగే టైంలో ఆయా కార్డులతో టై అప్ కలిగిన సంస్థలలో కొనుగోళ్లు చేసినా మనం అదనపు రివార్డులను పొందొచ్చు. ఉదాహరణకు మనం వినియోగించే క్రెడిట్ కార్డుతో ఒక విమానయాన సంస్థకు భాగస్వామ్య ఒప్పందం ఉందని భావిద్దాం. సీజనల్ సేల్స్ సమయంలో మనం ఆ విమానయాన సంస్థ వెబ్‌సైటులోకి వెళ్లి టికెట్ బుక్ చేసుకొని, క్రెడిట్ కార్డుతో చెల్లింపు జరిపితే రాయితీతో పాటు రివార్డులు, లాయల్టీ పాయింట్లు, క్యాష్ బ్యాక్ వంటివి లభిస్తాయి.