Credit Card Protection Plans :దేశంలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి. చాలా మంది దగ్గర ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డెబిట్, క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. ఈ కార్డులు పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లే అవసరాన్ని తగ్గించి, ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తున్నాయి. కానీ మీ క్రెడిట్ కార్డులు దొంగతనానికి లేదా ఆన్‌లైన్ మోసానికి గురైతే పరిస్థితి ఏమిటి? అప్పుడు మనకు ఎంత కష్టంగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఇలాంటి సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు 'క్రెడిట్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్' (CPP) తీసుకోవాలి.
రక్షణ కవచం
క్రెడిట్ కార్డులను పోగొట్టుకుంటే, ఆ కార్డులకు ఉన్న పరిమితి మేరకు మనం ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది. కనుక, నగదును తీసికెళ్లినప్పుడు ఎంత ప్రమాదం ఉంటుందో, కార్డులతోనూ అంతే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందుకే మీ క్రెడిట్ కార్డులకు తగిన 'కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్'ను తీసుకోవడం మంచిది.
CPP అంటే ఏమిటి?
క్రెడిట్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ అనేది మీ క్రెడిట్, డెబిట్, రిటైల్, మెంబర్‌షిప్ కార్డులు దొంగతనానికి గురైనప్పుడు; లేదా మీరు మోసానికి గురైనప్పుడు ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ లాగా పనిచేస్తుంది. ఈ సర్వీసును ఉపయోగించుకోవడానికి, కార్డుదారుడు నిర్ణీత వార్షిక రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇండియాలోని చాలా బ్యాంకులు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ సేవలను కొన్ని సర్వీస్ ప్రొవైడర్లు కూడా అందిస్తున్నారు. మీ క్రెడిట్ కార్డ్ పరిమితి ఆధారంగా ఈ సీపీపీ ప్లాన్స్ రుసుములు మారుతూ ఉంటాయి.
ఒకే కాల్‌తో
క్రెడిట్ కార్డు పోగొట్టుకున్నప్పుడు దాన్ని బ్లాక్ చేయమని అభ్యర్థిస్తూ కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం మామూలే. కానీ మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే, అప్పుడు అన్ని కార్డులను బ్లాక్ చేయడం కోసం వేర్వేరు కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇబ్బంది కలిగించే అంశం. అందుకే ఇలాంటి వారికి సీపీపీ చాలా ఉపయోగపడుతుంది.
ఇందుకోసం మీరు ఈ సీపీపీ ప్లాన్ సభ్యత్వం పొందేటప్పుడు మీ కార్డు వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత మీ కార్డులను పోగొట్టుకున్నా లేక అవి చోరీకి గురైనా సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది. ఒక్క ఫోన్ కాల్‌తో సదరు సీపీపీ ప్లాన్‌కు లింక్ చేసిన అన్ని కార్డులు బ్లాక్ చేస్తారు.
అత్యవసర ఆర్థిక సహాయం
మీరు విదేశాల్లో ఉన్నప్పుడు మీ క్రెడిట్, డెబిట్ కార్డులు పోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలోనే మీకు సీపీపీ చాలా ఉపయోగపడుతుంది. మీరు చెల్లించని హోటల్ బిల్లులు సెటిల్ చేయడానికి, మీ ప్రయాణ టిక్కెట్లను కొనుక్కొనేందుకు సీపీపీ అత్యవసర నగదు అడ్వాన్స్‌గా అందిస్తుంది. స్వదేశంలో ఉన్నట్లయితే, సీపీపీ సర్వీస్ ప్రొవైడర్ నుంచి అత్యవసర సహాయం 24 గంటల్లో చేరుతుంది. అదే విదేశాల్లో ఉండి కార్డులను పోగొట్టుకున్నట్లయితే, సహాయం పొందడానికి 48 గంటల సమయం పడుతుంది. పైగా ఈ ప్లాన్ కింద మీకు అందించిన అత్యవసర నగదు అడ్వాన్స్‌పై ఎలాంటి వడ్డీ విధించరు. అయితే, మీరు 28 రోజులలోపు ఈ మొత్తాన్ని తిరిగి పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది.
ఛార్జీలు
సీపీపీ వార్షిక ప్రీమియం రూ.1200 నుంచి మొదలవుతుంది. వార్షిక సభ్యత్వ ఛార్జీ అనేది ప్రొవైడర్‌ను బట్టి మారుతుంది. చోరికి గురైన కార్డుల విషయంలో అనధికార లావాదేవీలు జరిగినప్పుడు కూడా నియమ, నిబంధనలను బట్టి సీపీపీ సర్వీస్ ప్రొవైడర్ మీకు డబ్బులు చెల్లిస్తారు. అంతేకాదు మీరు కార్డు కోల్పోయిన 7-15 రోజుల వరకు - స్కిమ్మింగ్, ఫిషింగ్, ఆన్‌లైన్ మోసాల వల్ల జరిగిన మోసపూరిత లావాదేవీల నుంచి మిమ్మల్ని ఆర్థికంగా రక్షణ కల్పిస్తారు. గరిష్ఠ కవరేజీ మొత్తం సీపీపీ ప్రొవైడర్ ప్రకారం మారుతూ ఉంటుంది. పాన్ కార్డు పోగొట్టుకున్నప్పుడు కూడా అతి తక్కువ వ్యవధిలో అది భర్తీ అయ్యేలా చూస్తారు. పైగా దీనికి ఎటువంటి ఛార్జీ వసూలు చేయరు.
సీపీపీ కోసం దరఖాస్తు చేయడం ఎలా?
సీపీపీ కోసం దరఖాస్తు చేసి సభ్యత్వం పొందడం చాలా సులభం. ముందుగా మీరు ఎంచుకున్న ప్లాన్ కోసం దరఖాస్తు ఫారంను పూరించాలి. ఈ దరఖాస్తు ఫారం అనేది సర్వీస్ ప్రొవైడర్ లేదా బ్యాంకు రిజిస్టర్డ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రీమియం పూర్తిగా ప్లాన్ ప్రారంభంలోనే చెల్లించాల్సి ఉంటుంది. కార్డు ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఎంచుకునేటప్పుడే, సదరు ప్రొవైడర్లతో ముడిపడి ఉన్న బ్యాంకుల జాబితాను తెలుసుకోవాలి. అలాగే, మీ ప్లాన్‌లో పొందగలిగే గరిష్ఠ రీయింబర్స్‌మెంట్ మొత్తం గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడే మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉండగలుగుతారు.
మీ క్రెడిట్ కార్డు లిమిట్ తక్కువగా ఉందా? ఇలా చేస్తే ఈజీగా పెరుగుతుంది! - How To Increase Credit Card limit
మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే! - Best Sports Bikes In 2024