Manmohan Singh First Budget : పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న భారత దేశాన్ని గట్టెక్కించిన 1991 కేంద్ర బడ్జెట్‌ను ఒక ల్యాండ్ మార్క్ పద్దుగా పరిగణిస్తారు. దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. వాస్తవానికి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సొంత పార్టీ నుంచే మన్మోహన్ సింగ్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఏ మాత్రం తొణకకుండా, తానొక్కరే ఏటికి ఎదురీది - దేశాన్ని ఒడ్డునపడేశారు.
1991 ఐకానిక్ బడ్జెట్
దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ 1991లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆధునిక భారత్‌ను మేలిమలుపు తిప్పింది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సొంత పార్టీ నుంచి కూడా మన్మోహన్‌కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా ఎరువులు, పెట్రోల్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం చాలా మంది ఎంపీలకు మింగుడు పడలేదు. కానీ మన్మోహన్ మాత్రం ఆ వ్యతిరేకతను చాలా కూల్‌గా ఎదుర్కొన్నారు.
ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు చేపట్టగానే, ఆర్థికమంత్రిగా మన్మోహన్ సింగ్‌ను ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 1991 జులై 24న మన్మోహన్ ఈ ల్యాండ్‌మార్క్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ ఆర్థిక సంస్కరణలే దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాయి.
ఒంటరి పోరాటం
బడ్జెట్ తర్వాత జర్నలిస్ట్‌లు ఆడిగిన ప్రశ్నలను కాంగ్రెస్ నేతలు ఎదుర్కోలేకపోయారు. బడ్జెట్ తర్వాత ఎటువంటి షెడ్యూల్ లేకుండానే మన్మోహన్ ప్రెస్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ రాసిన 'టు ది బ్రింక్ అండ్ బ్యాక్: ఇండియా'స్ 1991 స్టోరీ'లో వెల్లడించారు. ఆ విలేకర్ల సమావేశంలో తన బడ్జెట్‌లోని అంశాలను మన్మోహన్ స్పష్టంగా వివరించారు. దానిని బడ్జెట్ విత్ హ్యూమన్ ఫేస్‌గా అభివర్ణించారు. తీవ్ర విమర్శల మధ్య కూడా ఎరువులు, పెట్రోల్, ఎల్‌పీజీ ధరల పెంపును సమర్థించారు. మరోవైపు సొంత పార్టీ నేతల్లో వచ్చిన అసంతృప్తిని నాటి ప్రధాని పీవీ నరసింహారావు గమనించి, ఆగస్టు1న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటుచేశారు. ఎంపీలు తమ ఆగ్రహం, అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కేందుకు అవకాశం ఇచ్చారు. వాటిని మన్మోహన్ నేరుగా ఎదుర్కొని సమాధానం చెప్పేలా నరసింహారావు మౌనంగా ఉన్నారు. ఈ సమావేశం 1991 ఆగస్టు 2, 3 తేదీల్లో సుదీర్ఘంగా కొనసాగింది. మన్మోహన్ సింగ్‌కు కేవలం మణిశంకర్ అయ్యర్, నాథూరామ్ మిర్ధా నుంచి మాత్రమే మద్దతు లభించింది. సభ్యులను శాంతపర్చేందుకు నాడు మన్మోహన్ ఎరువుల ధరలను స్వల్పంగా(40 శాతం నుంచి 30 శాతానికి) తగ్గించారు. ఎల్‌పీజీ, పెట్రోల్ ధరల్లో మాత్రం ఆయన రాజీ పడలేదు.
దేశ ఆర్థిక ప్రగతే లక్ష్యంగా
పార్టీ సమావేశాలు ముగియగానే 1991 ఆగస్టు 4, 5 తేదీల్లో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాలు జరిగాయి. లోక్‌సభలో ఆగస్టు 6న ఆర్థిక మంత్రి చేయాల్సిన ప్రకటనపై ఇందులో చర్చించారు. చివరికి బడ్జెట్ ప్రతిపాదనలను వెనక్కి తీసుకొనే డిమాండ్లను కొట్టిపారేసి, చిన్న రైతుల ప్రయోజనాలు కాపాడటానికి కట్టుబడినట్లు పేర్కొన్నారు. మొత్తం మీద అన్ని పక్షాలను శాంతపరుస్తూనే, ఎరువుల ధరలపై నియంత్రణ తొలగింపును మన్మోహన్ కొనసాగించగలిగారు. వాస్తవానికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన జులై నాటికి భారత విదేశీ మారకద్రవ్యం పూర్తిగా అడుగంటింది. దీంతో ఆ నెల ఆర్‌బీఐ తన వద్ద ఉన్న 41 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద కుదవపెట్టి విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చుకొంది. ఇది కూడా కొన్నాళ్లు మాత్రమే దేశ అవసరాలు తీర్చగలదు. దీంతో పీవీ-మన్మోహన్ జోడీ వ్యతిరేకతను ఎదురీది దేశాన్ని సంక్షోభ సుడిగుండం నుంచి ఒడ్డుకు చేర్చింది.