Savings Account Cash Deposit Limit :ప్రస్తుత కాలంలో దాదాపు అందరికీ బ్యాంకు అకౌంట్ ఉండే ఉంటుంది. ప్రభుత్వ పథకాలను పొందేందుకు, శాలరీ, ఇతర ఆర్థిక వ్యవహారాల కోసం చాలా మంది బ్యాంకు సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేస్తున్నారు. ఈ ఖాతాలో మీ డబ్బును సురక్షితంగా నిల్వ చేసుకోవడమే గాక స్వల్ప వడ్డీని కూడా పొందొచ్చు. అలాగే అన్ని డిజిటల్ లావాదేవీలు కూడా బ్యాంకు అకౌంట్ ఉంటేనే అవుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లో ఎంత నగదు నిల్వ చేసుకోవచ్చు? దానికేమైనా లిమిట్ ఉందా? నగదు నిల్వ పరిమితి దాటితే ఏమైనా సమస్యలు ఉంటాయా?
సేవింగ్స్ అకౌంట్లో ఎంత డిపాజిట్ చేయొచ్చు? లిమిట్ దాటితే ఏమవుతుంది? - Cash Deposit Limit
Savings Account Cash Deposit Limit : సాధారణ ప్రజలు తమ డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ (పొదుపు ఖాతా)ను తెరుస్తారు. దీని వల్ల ఖాతాదారుల డబ్బుకు రక్షణ ఉంటుంది. పైగా వడ్డీ రూపంలో రాబడి వస్తుంది. అయితే బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లో గరిష్ఠంగా ఎంత డబ్బు డిపాజిట్ చేయవచ్చు? దానికేమైనా లిమిట్ ఉందా? అనే సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. వాటికి సమాధానాలు ఈ స్టోరీలో చూద్దాం.
Published : Jun 26, 2024, 6:45 PM IST
లిమిట్ ఎంతో తెలుసా?
ప్రస్తుత కాలంలో చాలా మంది వినియోగదారులు సేవింగ్స్ అకౌంట్ ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు. వారికి సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో ఎంత జమ చేయవచ్చనే విషయంపై సందేహం ఉంటుంది. అయితే సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బైనా జమ చేసుకోవచ్చు. దానికి పరిమితి లేదు. కానీ ఆదాయపు పన్ను శాఖ ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్లో జమ చేయగల డబ్బులపై రూ.10 లక్షల పరిమితిని విధించింది. దీంతో రూ.10 లక్షల కంటే ఎక్కువ డబ్బుల్ని జమ చేస్తే మీరు ఆదాయపు పనన్ను పరిధిలో వస్తారు. ఆ నగదుకు మీరు పన్ను చెల్లించాల్సి రావొచ్చు. అలాగే రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు మీరు జమ చేస్తే ఐటీ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను శాఖ నిఘా పక్కా!
రూ.10 లక్షలు కన్నా ఎక్కువ నగదు సేవింగ్స్ అకౌంట్లో జమై ఉంటే ఆదాయపు పన్ను శాఖ మీపై నిఘా వేస్తుంది. మీ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ హిస్టరీని పరిశీలిస్తుంది. అలాగే బ్యాంకులు కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు కన్నా డిపాజిట్లు దాటిన సేవింగ్స్ అకౌంట్లను ఐటీ శాఖకు తెలియజేస్తాయి. దీంతో సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారుడికి ఐటీ శాఖ నోటీసులు పంపే అవకాశం కూడా ఉంది. ఎఫ్డీలలో నగదు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, స్టాక్స్‌లో పెట్టుబడులు, ఫోరెక్స్ కార్డులు మొదలైన విదేశీ కరెన్సీ కొనుగోళ్లకు కూడా రూ.10 లక్షల పరిమితి వర్తిస్తుంది.