Buying vs Renting House : ప్రస్తుతం భారతదేశంలో చాలా మంది సొంత ఇళ్లు కొనుక్కోవాలా? లేదా అద్దె ఇంట్లో ఉండాలా? అనే డైలమాలో ఉంటున్నారు. వాస్తవానికి ఇళ్లు కొనాలన్నా, లేదా సొంతంగా ఇళ్లు కట్టాలన్నా ఒకేసారి చాలా డబ్బు అవసరమవుతుంది. అదే అద్దె ఇంట్లో ఉంటే, ఫ్లెక్లిబుల్ రెంట్లు ఉంటాయి కనుక తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా చాలా సులువుగా నెట్టుకురావచ్చు.
సొంత ఇళ్లు వర్సెస్ అద్దె ఇళ్లు
Buying Vs Renting A House In India : వ్యక్తుల ఆర్థిక పరిస్థితులను అనుసరించి, వారి ప్రాధాన్యతలు కూడా మారుతూ ఉంటాయి. కానీ మెజారిటీ ఆర్థిక నిపుణుల ప్రకారం, అద్దె ఇంటి కన్నా, సొంత ఇళ్లు కలిగి ఉండడం వల్ల దీర్ఘకాలంలో గొప్ప ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
నచ్చినట్లు జీవించవచ్చు!
Own House Benefits : సొంత ఇళ్లు మీ కుటుంబానికి రక్షణ కల్పిస్తుంది. దీర్ఘకాలంలో ఒక ముఖ్యమైన ఫైనాన్సియల్ ఆసెట్గా మారుతుంది. మీ జీవితంలో మీ ఇష్టం వచ్చినట్లు బతకడానికి అవకాశం కల్పిస్తుంది. అదే అద్దె ఇంట్లో ఉంటే, దాని యజమానికి నచ్చినట్లు మనం ఉండాలి. వాళ్లు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాలి. రూమ్ రెంట్స్ పెంచితే, దానికి తగ్గట్లుగా మన జీవన వ్యయాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది వాస్తవానికి వ్యక్తుల స్వతంత్ర జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది.
ఆర్థికంగా ఆదుకుంటుంది!
Own House Financial Benefits : సాధారణ సమయంలో మీ కుటుంబానికి నీడ కల్పించే ఇళ్లు, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మీకు ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ఎలా అంటే? సాధారణ సమయంలో మీరు మీ ఇంట్లో నివశిస్తారు. లేదా ఇతరులకు అద్దెకు ఇచ్చి నెలవారీగా రెంట్‌ను పొందుతారు. మరీ అత్యవసరమైతే దానిని తాకట్టు పెట్టవచ్చు. లేదా అమ్మకానికి పెట్టి డబ్బులు సమకూర్చుకోవచ్చు.
చాలా ప్రయోజనాలు ఉంటాయ్!
గృహ యజమానిగా ఉండడం వల్ల మీకు ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. అలాగే అది మీ ఇన్వెస్ట్మెంట్ పొటెన్సియల్ను పెంచుతుంది. అంతే కాకుండా టాక్స్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఇంకా సొంత ఇళ్లు ఉండడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం.
1. ప్రైస్ అప్రిసియేషన్
House Price Appreciation :సొంత ఇళ్లు కొనుక్కోవడం లేదా కట్టుకోవడం అనేది దీర్ఘకాల పెట్టుబడి కిందకు వస్తుంది. భవిష్యత్‌లో ఇంటి ధరలు కచ్చితంగా పెరుగుతాయి. అందువల్ల ఒక గృహ యజమానిగా మీకు మంచి ఆర్థిక స్థిరత్వం, లబ్ధి చేకూరుతాయి.
2. గృహ నిర్వహణ ఖర్చులు స్థిరంగా ఉంటాయ్!
Home Maintenance Cost : సొంత ఇళ్లు ఉన్నవారికి గృహ నిర్వహణ ఖర్చులు దాదాపు స్థిరంగా ఉంటాయి. అదే అద్దె ఇంట్లో ఉంటే, రెంట్ పెరిగిన ప్రతి సారీ జీవన వ్యయాలు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. పైగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా ఆర్థికంగా వారిని కృంగదీస్తుంది.
3. గృహ యజమానిగా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది!
సొంత ఇళ్లు ఉండడం వల్ల ఒక గృహ యజమానిగా మీకు మంచి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. అలాగే కాలానికి అనుగుణంగా తనకు నచ్చినట్లు గృహంలో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి వీలవుతుంది. అద్దె ఇంట్లో ఉంటున్నవారికి ఇలాంటి సౌకర్యాలు ఏమీ ఉండవు.
4. ఇంటి ఓనర్‌తో తలనొప్పులు ఉండవు!
అద్దె ఇంట్లో ఉన్నవారికి ఇంటి యజమాని వల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయి. ఇంటి యజమాని పెట్టే షరతులు నచ్చినా, నచ్చకపోయినా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒక వేళ ఏదైనా ఇంట్లో మార్పులు, చేర్పులు చేయాలన్నా కుదరదు. అదే సొంత ఇళ్లు ఉంటే, ఈ సమస్యలు ఏమీ రావు.