Maruti e Vitara Unveiled :భారతదేశంలోని అతిపెద్ద కార్ తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తన ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అయిన ఈ-విటారాను శుక్రవారం ఆవిష్కరించింది. ఇది మోస్ట్ పాపులర్ గ్రాండ్ విటారా ఎస్‌యూవీకి చెందిన ఈ-వెర్షన్. దీనిని దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేయనున్నారు.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను ప్రధాని మోదీ శుక్రవారం దిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ వాహనాలను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో భాగంగా తన మొదటి ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్ ఈ-విటారాను ఆవిష్కరించిన మారుతి సుజుకి, దేశంలోని 1000 సిటీల్లో 1500 ఈవీ-ఎనేబుల్డ్ సర్వీస్ వర్క్‌షాప్‌లను కూడా ఏర్పాటుచేయనున్నట్లు తెలిపింది. ఇందులో ఛార్జింగ్ ఫెసిలిటీతోపాటు, వినియోగదారులకు మంచి సర్వీస్ ఇచ్చేందుకు అవసరమైన స్పెషల్ ఎక్విప్మెంట్ సహా ట్రైన్డ్ సిబ్బంది ఉంటారని పేర్కొంది.
e-Vitara Features :మారుతి సుజుకిఈ-విటారా కారు 49కిలోవాట్, 61 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. దీని డ్రైవింగ్ రేంజ్ 500 కి.మీ వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది. దీని ఎక్స్టీరియర్ రగ్గడ్ లుక్‌లో ఉంది. దీనికి 18-అంగుళాల వీల్స్ ఏర్పాటు చేశారు. ఈ కారులో ఫ్లోటింగ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయెల్-స్క్రీన్ సెటప్, ఆటో ఏసీ, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ ఉన్నాయి. అలాగే 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఉన్నాయి. సేఫ్టీపరంగా చూస్తే, దీనిలో స్టాండర్డ్‌గా 7 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే దీనిలో వైర్లెస్ ఫోన్ ఛార్జర్, 10-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా ఉన్నాయి.
49 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉన్న కారు 144 పీఎస్ పవర్, 192.5 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇక 61కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉన్న కారు 174 పీఎస్ పవర్, 192.5 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనిపై ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 500 కి.మీ దూరం వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.