తెలంగాణ

telangana

ETV Bharat / business

వాహనాలకు 'BH' సిరీస్ నంబర్ ప్లేట్లు- ఎలా అప్లై చేయాలి? లాభాలేంటి? - BH Series Number Plates Advantages

BH Series Number Plates : బీహెచ్’ అంటే ‘భారత్’. మీకు భారత్ (బీహెచ్) సిరీస్ వాహన నంబర్ ప్లేట్ల గురించి తెలుసా? 2021 సంవత్సరం నుంచి వీటిని జారీ చేస్తున్నారు. కొన్ని ప్రత్యేక అవసరాలు కలిగిన వాళ్లు వీటిని పొందొచ్చు. ఈ నంబర్ ప్లేట్లు పొందితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పాన్ ఇండియా రేంజ్‌లో వాహనాన్ని నడిపేందుకు లైన్ క్లియర్ అవుతుంది. బీహెచ్ నంబర్ ప్లేట్​ పూర్తి వివరాలు మీ కోసం.

BH Series Number Plates Advantages
BH Series Number Plates

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 5:17 PM IST

Updated : Mar 17, 2024, 5:51 PM IST

BH Series Number Plates :వాహనం నంబర్ ప్లేట్ అనగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తుకొచ్చేవి ‘ఏపీ’, ‘టీజీ/టీఎస్’. అయితే ‘బీహెచ్’ అనే ఒక సిరీస్ కూడా ఉంటుందని చాలా మందికి తెలియదు. ఈ వార్తను చదువుతూ మీరు అంచనా వేసింది కరెక్టే. ‘బీహెచ్’ అంటే ‘భారత్’. ఈ భారత్ (బీహెచ్) సిరీస్ వాహన నంబర్ ప్లేట్లను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ 2021 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం దేశవ్యాప్తంగా రాకపోకలు సాగిస్తుండే పాన్ ఇండియా వాహనాలకు బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్లను కేటాయిస్తుంటారు. వివిధ రాష్ట్రాల పరిధిలో తరుచుగా ట్రాన్స్‌ఫర్లు జరిగే ఉద్యోగులు, తరుచూ వేర్వేరు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వివిధ వృత్తులకు చెందిన వ్యక్తులు కూడా ఈ నంబర్ ప్లేట్లు పొందడానికి అర్హులు. బీహెచ్ (BH) నంబర్ ప్లేట్‌ ప్రయోజనాలు, దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలు మీ కోసం.

అర్హులు ఎవరో తెలుసా?
బీహెచ్ నంబర్ ప్లేట్లను ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సిబ్బందికి మంజూరు చేస్తుంటారు. వివిధ రాష్ట్రాలకు తరుచూ రాకపోకలు సాగించే వారు కూడా దీని కోసం అప్లై చేసుకోవచ్చు. బీహెచ్ నంబర్ ప్లేట్‌ను మనం ఒకసారి పొందితే, ఏదైనా రాష్ట్రానికి వెళ్లినప్పుడు అక్కడి రవాణా శాఖ జారీ చేసే నంబర్ ప్లేట్ పొందాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే బీహెచ్ అంటేనే పాన్ ఇండియా నంబర్ ప్లేట్! దీని వల్ల చాలా వరకు సమయం, డబ్బులు ఆదా అవుతాయి. పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (పీఎస్‌యూ) ఉద్యోగులు, కనీసం నాలుగు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ కంపెనీల ఉద్యోగుల ఈ నంబర్ ప్లేట్ పొందడానికి అర్హులు.

అప్లై చేయడం ఇలా?
కొత్తగా కారు లేదా ఏదైనా వాహనం కొనేటప్పుడే బీహెచ్ (BH) నంబర్ ప్లేట్‌ను పొందొచ్చు. ఇందుకోసం మీకు వాహనం విక్రయించే అధీకృత వాహన డీలర్‌‌ను కలిసి బీహెచ్ (BH) నంబర్ ప్లేట్ కావాలని చెప్పాలి. దీంతో ఆ డీలర్‌ ‘వాహన్’(Vahan) పోర్టల్‌లో బీహెచ్ నంబర్ ప్లేట్ కోసం మీ తరఫున అప్లై చేస్తాడు. ఇప్పటికే వాహనం ఉన్నవారు కూడా నేరుగా బీహెచ్ నంబర్ ప్లేట్ కోసం ‘వాహన్’ పోర్టల్‌లో అప్లై చేయొచ్చు. అయితే అందుకు తాము అర్హులమని రుజువు చేసే ధ్రువపత్రాలు, వాహన రికార్డులను సమర్పించాల్సి ఉంటుంది.

కొన్ని ఖర్చులు - కొన్ని పొదుపులు
మీరు వాహనం కొనేటప్పుడే బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ పొందాలని భావిస్తే, అందుకయ్యే ఖర్చు అనేది వాహనం ఎక్స్-షోరూమ్ ధరపై ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల ఎక్స్-షోరూమ్ ధరలో 6 శాతానికి సమానమైన మొత్తాన్ని ‘బీహెచ్’ సిరీస్ నంబర్ ప్లేటు కోసం కట్టాల్సి ఉంటుంది. రూ.20 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న పెట్రోల్ లేదా డీజిల్ కార్లకు అయితే వాటి ఎక్స్ షోరూమ్ ధరలో 12 శాతం వరకు పే చేయాలి. తొలుత ఇంత భారీగా అమౌంట్ కట్టడం కొంత భారంగానే అనిపిస్తుంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నిత్యం రాకపోకలు సాగించే వాళ్లే ఈ నంబర్ ప్లేట్ తీసుకుంటారు. ఇది తీసుకున్నాక, చాలా డబ్బులు ఆదా అవుతాయి. ఆయా రాష్ట్రాల రవాణా శాఖ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం తప్పుతుంది. అంటే వాహనం కొనేటప్పుడు ‘బీహెచ్’ సిరీస్ నంబర్ ప్లేటు కోసం పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ సౌకర్యమే ఆ తర్వాత వాహనదారులకు కలుగుతుందన్న మాట.

మొత్తం మీద ‘బీహెచ్’ సిరీస్ నంబర్ ప్లేటు అనేది మనదేశంలో వాహన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా పడుతున్న ముందడుగు లాంటివి. ఇవి వాహనాలకు దేశవ్యాప్తంగా చెల్లుబాటును అందిస్తాయి. వాహనదారులకు ఎనలేని సౌకర్యాన్ని చేకూరుస్తాయి.

వాహనాల నంబర్​ ప్లేట్ల రంగులు​.. వాటి ప్రత్యేకతలు ఏమిటో మీకు తెలుసా?

దేశవ్యాప్తంగా పెట్రో ధరల్లో ఏపీ టాప్- పన్నుల బాదుడే కారణం- తెలంగాణ ర్యాంక్ ఎంతంటే?

Last Updated : Mar 17, 2024, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details