SC Ruling On Credit Cards : క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాడ్‌న్యూస్. వేలకు వేల రూపాయలు కార్డు ద్వారా వాడేసి బిల్లు చెల్లించడంలో విఫలమైతే వడ్డీ మోత మోగనుంది. అందులో బ్యాంకులదే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది. వడ్డీపై పరిమితి ఉండాలన్న జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. దీంతో నిర్ణీత గడువులోగా బిల్లు చెల్లించని వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో వడ్డీ వసూలు చేసుకొనేందుకు బ్యాంకులకు మార్గం సుగమమైంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ యూజర్లు సకాలంలో బిల్లు చెల్లించడంపై దృష్టి సారించాలంటున్నారు నిపుణులు.
క్రెడిట్ కార్డ్ బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా? ఈ సుప్రీంకోర్ట్ తీర్పు తెలుసుకోవాల్సిందే! - SC RULING ON CREDIT CARDS
క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు - ఇకపై బ్యాంకులకు వడ్డీ రేట్లు పెంచుకునే అవకాశం
Published : 16 hours ago
ఏమిటీ కేసు?
క్రెడిట్ కార్డు బిల్స్ ఆలస్య చెల్లింపులపై వార్షికంగా 30 శాతానికి మించి వడ్డీ వసూలు చేయరాదని ఎన్‌సీఈడీఆర్‌ఎసీ 2008లో తీర్పు వెలువరించింది. ఆలస్య చెల్లింపులపై బ్యాంకులు 36 నుంచి 49 శాతం మేర వడ్డీ వసూలు చేస్తుండడంపై ఆవాజ్ ఫౌండేషన్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడంతో ఈ తీర్పు వెలువడింది. దీనిపై కొన్ని బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తొలుత స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు 2009లో తీర్పుపై స్టే విధించింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెడుతూ కమిషన్ ఆదేశాలను పక్కన పెట్టింది. 30% పరిమితి వర్తించదని తెలిపింది.
నిపుణులు ఏమంటున్నారు?
క్రెడిట్ కార్డు అనేది సక్రమంగా వాడుకుంటే, అది ఇచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అత్యవసర సమయాల్లో ఇవి ఉపయోగపడటం సహా మన రోజువారీ ఖర్చులకు కార్డును వాడడం ద్వారా రివార్డు పాయింట్లు కూడా పొందవచ్చు. పైగా మనం వాడుకున్న మొత్తానికి దాదాపు 45 రోజుల వడ్డీ రహిత గడువు కూడా లభిస్తుంది. కాబట్టి గడువులోగా బిల్లు చెల్లిస్తే క్రెడిట్ కార్డుతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒక వేళ బిల్లు చెల్లించకపోతే మాత్రం భారీగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వడ్డీ రహిత గడువులోగా నిర్ణీత మొత్తాన్ని చెల్లించడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునే వారు బ్యాంకు నిబంధనలు, ఆలస్య చెల్లింపులపై విధించే వడ్డీ రేట్ల వివరాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.