Best Cars Under 5 lakh In India :భారతదేశంలో ఒకప్పుడు రూ.5 లక్షల బడ్జెట్లో చాలా మంచి కార్లు లభించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తయారీ ఖర్చులు భారీగా పెరగడం వల్ల కార్ల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో ఇంకా రూ.5 లక్షల బడ్జెట్లో మంచి కార్లు దొరుకుతున్నాయా అంటే? దీని సమాధానం 'అవును' అని చెప్పవచ్చు. ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో రూ.5 లక్షల బడ్జెట్లో లభిస్తున్న కార్లు కేవలం మూడే ఉన్నాయి. అవి:
- మారుతి సుజుకి ఆల్టో కె10
- మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో
- రెనో క్విడ్ (Renault Kwid)
అయితే ఈ కార్లలో కొన్ని వేరియంట్లు మాత్రమే రూ.5 లక్షలు (ఎక్స్-షోరూం) బడ్జెట్లో లభిస్తాయి. మిగతా హై-ఎండ్ మోడల్స్ ఇంకా ఎక్కువ రేటు ఉంటాయి. అయితే మీరు కనుక స్ట్రిక్ట్‌గా రూ.5 లక్షల బడ్జెట్లోనే కార్ కొనాలని అనుకుంటే, వీటిపై ఓ లుక్కేయవచ్చు.
1. Maruti Suzuki Alto K10 :ఇండియాలో లభిస్తున్న అత్యంత సరసమైన కార్లలో మారుతి సుజుకి ఆల్టో కె10 ఒకటి. ఆల్టో 800ని పూర్తిగా నిలిపివేయడం వల్ల ప్రస్తుతం ఇండియాలో ఆల్టో కె10 మాత్రమే లభిస్తోంది. ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి - స్టాండర్డ్ (Std), బేసిక్ పెట్రల్ (Lxi) వేరియంట్లు. ఈ ఆల్టో కె10 కారులో 1.0 లీటర్ కె10సీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 67 పీఎస్ పవర్, 89 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనికి అనుసంధానంగా 5-స్పీడ్ ఎమ్టీ గేర్‌బాక్స్ ఉంటుంది. రూ.5 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
Maruti Suzuki Alto K10 Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి ఆల్టో కె10 స్టాండర్డ్ వేరియంట్ ధర సుమారుగా రూ.3.99 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. స్టాండర్డ్ పెట్రోల్ వేరియంట్ (Lxi) ధర సుమారుగా రూ.4.83 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
2. Maruti Suzuki S-Presso :మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోలో చాలా వేరియంట్లు ఉన్నాయి. వాటిలో స్టాండర్డ్ వేరియంట్ మాత్రమే రూ.5 లక్షల బడ్జెట్లో లభిస్తుంది. మిగతా వాటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్టాండర్డ్ ఎస్-ప్రెస్సో కారులో కూడా ఆల్టో కె10లో ఉన్న 1.0 లీటర్ కె10సీ ఇంజినే ఉంటుంది.